ముగిసిన సూర్యగ్రహణం : గోల్డ్ రింగ్ ను తలపించిన సూర్యుడు

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 06:25 AM IST
ముగిసిన సూర్యగ్రహణం : గోల్డ్ రింగ్ ను తలపించిన సూర్యుడు

సూర్యగ్రహణం ముగిసింది. సంపూర్ణ సూర్యగ్రహణం దేశవ్యాప్తంగా కనువిందు చేసింది. సూర్యుడు సప్తవర్ణాలతో కనిపించాడు. గురువారం(డిసెంబర్ 26,2019) ఉదయం 8గంటల 8 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 11 నిమిషాల వరకు సూర్యగ్రహణం కొనసాగింది. ఈ ఏడాదిలో ఇది మూడో సూర్యగ్రహణం. మన దేశంలో కర్నాటక, కేరళ, తమిళనాడు బోర్డర్ లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సూర్యగ్రహణం పాక్షికమే. దుబాయ్ లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. సూర్యుడు గోల్డ్ రింగ్ ను తలపించాడు.

భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, ఫిలిప్సీన్స్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌ దేశాల్లో సూర్యగ్రహణం కనిపించింది. దుబాయ్ లో సంపూర్ణ గ్రహణం కనువిందు చేసింది. చందమామ చుట్టూ సూర్య జ్వాలలు విరజిమ్ముతూ గోల్డెన్‌ రింగ్‌ వలె కనిపించింది. హైదరాబాద్‌లో ముప్పావు వంతు మాత్రమే సూర్యగ్రహణం కనిపించింది.

కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. కోయంబత్తూర్, పాలక్కాడ్, మంగుళూరు, ఉడిపి ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షకులను ఆకట్టుకుంది. ఇక, ఉత్తరాది రాష్ట్రాల్లో సూర్యగ్రహణ ప్రభావం అంతగా లేదు. మూల నక్షత్రం ధనస్సు రాశిలో ఏర్పడిన కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం మూడు గంటలకుపైగా కొనసాగింది. సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆలయాలను బుధవారం(డిసెంబర్ 25,2019) రాత్రే మూసివేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అభిషేకం, సంప్రోక్షణ తర్వాత తిరిగి తెరిచారు.

సూర్యగ్రహణం అన్నది సర్వసాధారణంగా జరిగేది. సౌర కుటుంబంలో సూర్యుడి చుట్టూ గ్రహాలు దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతాయి. గ్రహాల చుట్టూ ఉప గ్రహాలు పరిభ్రమిస్తుంటాయి. సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమించే క్రమంలో భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు.. గ్రహణాలు ఏర్పడతాయి. అమావాస్య నాడు సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు భూమ్మీద కొంత భాగంలో ఉన్న వారికి సూర్య బింబం పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ కనిపించకుండా పోతుంది.

ప్రతి ఏటా ఐదు నుంచి ఏడు గ్రహణాలు ఏర్పడతాయి. 2019లో ఇప్పటికే నాలుగు గ్రహణాలు ఏర్పడ్డాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు. గురువారం ఏర్పడిన సూర్యగ్రహణం 5వది. ఒకే ఏడాదిలో 5 గ్రహణాలు ఏర్పడటం అరుదుగా జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, ప్రతి పదేళ్లకు గ్రహణాలు ఏ వరుస క్రమంలో ఏర్పడ్డాయో అదే వరుస క్రమం రిపీట్ అవుతుందని చెప్పారు.