Solar Eclipse 2022 : సూర్యగ్రహణం నేరుగా చూస్తున్నారా? చాలా డేంజర్ అంటున్న నిపుణులు

గ్రహణాన్ని నేరుగా కంటితో చూడటం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించారు. సూర్యుడిని నేరుగా చూస్తే రెటీనా దెబ్బతిని, కంటికి ప్రమాదం కలుగుతుందని తెలిపారు.

Solar Eclipse 2022 : సూర్యగ్రహణం నేరుగా చూస్తున్నారా? చాలా డేంజర్ అంటున్న నిపుణులు

Solar Eclipse 2022 : దేశంలోని పలు ప్రాంతాల్లో సూర్యగ్రహణం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రహణం మొదలైంది. హైదరాబాద్ లో సాయంత్రం 4.59 గంటలకు, విజయవాడలో సాయంత్రం 4.49 గంటలకు, విశాఖలో సాయంత్రం 5.01 గంటలకు, తిరుపతిలో సాయంత్రం 5.01 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభమైంది.

మన దేశంలో సాయంత్రం 6గంటల 26 నిమిషాలవరకు సూర్యగ్రహణం కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రాంతాలను బట్టి స్వల్ప మార్పులు ఉంటాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం 49 నిమిషాల పాటు కనిపించనుంది. గ్రహణాన్ని వీక్షించేందుకు పిల్లలు, పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు.

కాగా, గ్రహణాన్ని నేరుగా కంటితో చూడటం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించారు. సూర్యుడిని నేరుగా చూస్తే రెటీనా దెబ్బతిని, కంటికి ప్రమాదం కలుగుతుందని తెలిపారు. బ్లాక్ ఫిల్మ్, బ్లాక్ పాలిమార్, సోలార్ ఫిల్టర్, గాగుల్స్, వెల్డింగ్ గ్లాస్ ద్వారా గ్రహణాన్ని చూడొచ్చని చెప్పారు.

ఈ గ్రహణాన్ని అరుదైన ఖగోళ విచిత్రంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే చాలా ఏళ్ల వరకు ఇలాంటి గ్రహణం మళ్లీ భారత్ లో కనిపించదు. మన దేశంలో తదుపరి సూర్యగ్రహణం 2027 ఆగస్టు 2న కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.

సూర్యగ్రహణం సమయంలో మన దేశంలో పలు చోట్ల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మరోవైపు గ్రహణం ఎఫెక్ట్ తో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. గ్రహణం చూస్తే సమస్యలను ఎదుర్కొంటారని, అశుభం అని చెబుతుండటంతో దాన్ని చూసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పలు రకాల అనర్దాలు జరుగుతాయని భయపడుతుంటారు. అయితే సైంటిస్టులు మాత్రం ఇలాంటి అపోహలను, నమ్మకాలను కొట్టిపారేస్తున్నారు.

తలుపులు మూసుకుని ఇంట్లో కూర్చుంటే ఖగోళంలో సంభవించే అద్భుతాలు చూడలేరని, బయటికొచ్చి గ్రహణాన్ని ఎంజాయ్ చేయాలని జనవిజ్ఞాన వేదిక స్పష్టం చేసింది. హైదరాబాద్ ఓయూ క్యాంపస్ లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సూర్యగ్రహణంపై నెలకొన్న మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. గ్రహణ సమయంలో భోజనం చేయకూడదనే అపోహలను తొలగిస్తూ సామూహిక భోజనాలు చేశారు. ఇక గ్రహణానికి, పిల్లలకు వచ్చే మొర్రికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.