Chirag Paswan : సింహం బిడ్డని..ఎల్జేపీలో తిరుగుబాటు వెనుక జేడీయూ హస్తం

దివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తనయుడు చిరాగ్‌ పాశ్వాన్‌, బాబాయ్‌ పశుపతి కుమార్‌ పరాస్‌ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఎల్జేపీలో తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే.

Chirag Paswan : సింహం బిడ్డని..ఎల్జేపీలో తిరుగుబాటు వెనుక జేడీయూ హస్తం

Son Of A Lion Says Chirag Paswan Sidelined By Rebels In His Ljp Party

Chirag Paswan దివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తనయుడు చిరాగ్‌ పాశ్వాన్‌, బాబాయ్‌ పశుపతి కుమార్‌ పరాస్‌ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఎల్జేపీలో తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. పశుపతి పరాస్‌ సహా ఐదుగురు ఎంపీలు చిరాగ్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేశారు. చిరాగ్ ను లోక్ సభా పక్ష నేతగా తొలగించడమే కాకుండా జాతీయ అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పిస్తున్నట్లు మంగళవారం పరాశ్ బృందం ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ చిరాగ్ పాశ్వాన్ మీడియాతో మాట్లాడారు. తనకు ఆరోగ్యం బాగా లేని సమయం చూసి, పార్టీలో ఇబ్బందులు సృష్టించడానికి ప్రణాళికలను రచించారని చిరాగ్ ఆరోపించారు.

చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. పార్లమెంటరీ నేతగా ఉంటానని పశుపతి పరాస్‌ నన్ను కోరితే ఎంతో సంతోషంగా ఒప్పుకునేవాడిని. ఆయనను నాయకుడిని చేసేవాడిని. కానీ ఆయన అలా చేయలేదు. పైగా నన్ను పార్టీ జాతీయాధ్యక్ష పదవి నుంచి తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఈ విషయంపై పోరాడేందుకు నేను సిద్ధమవుతున్నా. నన్ను ఘోరంగా మోసం చేశారు. నిజానికి కొన్ని రోజులుగా నాకు ఆరోగ్యం బాగాలేదు. టైఫాయిడ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. నేను మంచాన పడి ఉన్న సమయంలో ఇలాంటి వ్యూహంతో నాకు వెన్నుపోటు పొడవడం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. పార్టీని, కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచేందుకు నా శాయశక్తులా ప్రయత్నించాను. మా అమ్మ కూడా బాయ్‌తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. పరాస్‌ను నా తండ్రిలా భావించాను. కానీ ఆయన నా తండ్రి మరణించిన నాడే మాకు దూరంగా వెళ్లిపోయారని చిరాగ్‌ భావోద్వేగానికి లోనయ్యారు.

నిజానికి ప్రస్తుత పరిస్థితికి జేడీయూనే ముఖ్య కారణమని పాశ్వాన్ ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా గొంతెత్తే పార్టీలను విడగొట్టేందుకు వారు ఎంతకైనా తెగిస్తారన్నారు. గతకొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు. ఏదేమైనా తాను రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కుమారుడినని, సింహం బిడ్డనని..కచ్చితంగా పోరాడి విజయం సాధిస్తానని పాశ్వాన్ అన్నారు.

మరోవైపు, గతేడాది చివర్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ ఘోర పరాజయం గురించి చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ..తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ మరణించిన కొన్ని రోజులకే ఎన్నికలు వచ్చాయని, వాటిని ఎదుర్కోవడం కాస్త ఇబ్బందిగా మారిందని గుర్తు చేసుకున్నారు. అయినా ప్రజలు తమ పార్టీని ఆదరించారని, ఎల్జేపీకి ఓటింగ్‌ శాతం 2 నుంచి 6 శాతానికి పెరిగిందన్నారు. జేడీయూ కారణంగానే తాము ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాల్సి వచ్చిందని, జేడీయూ కారణంగానే తాము ఒంటరిగా బరిలోకి దిగామని వెల్లడించారు. సీఎం నితీశ్ విధానాలను తాను ఏనాటికీ ఒప్పుకోనని, ఎవరి ముందూ తలవంచుకోవద్దని తాను నిర్ణయించుకున్నానని, అందుకే ఒంటరిగా బరిలోకి దిగానని వెల్లడించారు. ఎన్నికల సమయంలోనూ కొందరు పోరాటం చేయలేదని, బాబాయ్ పశుపతినాథ్ ఎన్నికల సమయంలో ఎలాంటి భూమికా పోషించలేదని చిరాగ్ తెలిపారు.

ఇక,లోక్​సభలో పశుపతి కుమార్​ పరాస్​ను పార్లమెంటరీ పక్ష నేతగా ప్రకటించడాన్ని తప్పుబడుతూ స్పీకర్ ఓం బిర్లాకి చిరాగ్ పాశ్వాన్ మంగళవారం ఓ లేఖ రాశారు. పార్టీ నిబంధనలకు విరుద్ధమైన మునుపటి నిర్ణయాన్ని సమీక్షించి, లోక్​సభలో తనను ఎల్​జేపీ నాయకుడిగా ప్రకటిస్తూ.. కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్ ​ను పాశ్వాన్ కోరారు.