విపక్షాలతో సోనియా మీటింగ్….వలసకూలీలు,కేంద్ర ప్యాకేజీపై చర్చ

  • Published By: venkaiahnaidu ,Published On : May 19, 2020 / 12:07 PM IST
విపక్షాలతో సోనియా మీటింగ్….వలసకూలీలు,కేంద్ర ప్యాకేజీపై చర్చ

కోవిడ్-19 కారణంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయిన దేశ ఆర్థికవ్యవస్థ తరిగి కోలుకునేందుకు మోడీ సర్కార్ ఇటీవల 20లక్షల కోట్ల ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీపై భిన్నస్వరాలు ప్రతిధ్వనిస్తున్నాయి. అన్ని వర్గాలకు న్యాయంచేస్తూ.. మార్కెట్లో సరికొత్త అవకాశాలు అందిపుచ్చుకునేలా ప్యాకేజీ ఉందని బీజేపీ అంటుంటే…. ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు,వలసకూలీలకు రూపాయి ఇవ్వకుండా రిఫామ్స్‌ పేరుతో పేదల పొట్ట కొట్టారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

 20లక్షల కోట్లతో ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ప్రకటిస్తామని మోడీ చేసిన ప్రకటన 130 కోట్లమంది జనాల్లో మొదట్లో ఆశలు రేకెత్తించింది. కోవిడ్‌ తెచ్చిన కష్టంతో ఆర్థికంగా చితికిపోయిన వలసకూలీల నుంచి బడా వ్యాపారవేత్తల వరకూ అందరిలో ఒక్కసారి ప్రాణం లేచివచ్చినట్టైంది. GDPలో 10శాతం ప్యాకేజీ అనడంతో.. మార్కెట్లో డిమాండ్‌ సృష్టించడానికి క్యాష్‌ స్కీములు ఉంటాయని ఊహించారు నిపుణులు.

హెలికాప్టర్‌ మనీ.. క్వాంటటేటీవ్‌ ఈజింగ్‌ వంటి చర్యలు తీసుకుంటారని అంచనా వేశారు. కానీ ఇందుకు భిన్నంగా  ప్రకటించిన ప్యాకేజీలో… ప్రభుత్వం ఖర్చు చేస్తోంది సుమారు 2లక్షల కోట్లు మాత్రమేనని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులోనూ సగం రానున్న రెండుమూడేళ్లకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికలున్నాయి. మిగిలినదంతా RBI విధించిన మారిటోరియం, రెపోరేట్‌ లెక్కలే చూపించారు. అవే 8లక్షల కోట్లకుపైగానే ఉన్నాయి. 

ఈ సమయంలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ,దేశంలో కరోనా పరిస్థితి,లాక్ డౌన్ ప్రభావం,వలసకూలీల ఇబ్బందులు,రైతుల సమస్యలు,బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మికుల చట్టాలు రద్దు వంటి అంశాలపై విపక్ష నాయకులతో కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. శుక్రవారం(మే-22,2020)సోనియా అధ్యక్షత ఈ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనుంది.

సోనియా గాంధీ అధ్యక్షతలన జరుగనున్న ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, వెస్ట్ బెంగాల్ సీఎం అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఐ(ఎం)సీతారాం ఏచూరి,సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజా,జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్,ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్,ఆర్ఎల్డీ నాయకుడు అజిత్ సింగ్,ఎల్జేడీ నాయకుడు శరద్ యాదవ్,హిందుస్థాన్ ఆవాస్ మోర్చా నాయకుడు జితిన్ మాంజీ,ఆర్ఎల్ఎస్పీ నాయకుడు ఉపేంద్ర కుష్వా వంటి పలువురు ముఖ్యమైన నాయకులు హాజరవుతున్నారు. ఇప్పటికే దాదాపు 18పార్టీలు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు అంగీకరించాయి. బీఎస్పీ,ఆప్,జేడీఎస్ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నట్లు సమాచారం.

ఈ మీటింగ్ కోసం విపక్షనాయకులతో సీనియర్ కాంగ్రెస్ లీడర్ అహ్మద్ పటేల్ కో ఆర్డినేట్ చేస్తున్నారు. దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత విపక్ష నాయకుల మొదటి మీటింగ్ ఇదే. ఈ సమావేశం దేశంలోని రాజకీయ పరిస్థితులను విశ్లేషించడానికి మరియు COVID-19 విషయంలో మోడీ ప్రభుత్వం యొక్క “సరిపోని” ప్రతిస్పందనను బహిర్గతం చేయడానికి ఒక వ్యూహాన్ని రూపొందించడానికి సహాయపడుతుందని,కేంద్ర ప్రభుత్వం యొక్క ఏకపక్ష వైఖరి రాష్ట్రాలకు కష్టాలను తెచ్చిపెడుతోందని తృణముల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అన్నారు.