Sonia Gandhi : టార్గెట్ 2024..విపక్షాలకు సోనియా దిశానిర్దేశం

ఎన్డీయే సర్కార్ కి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఇవాళ 19 పార్టీల నేతలతో వర్చువల్​గా సమావేశమయ్యారు.

Sonia Gandhi : టార్గెట్ 2024..విపక్షాలకు సోనియా దిశానిర్దేశం

Sonia

Sonia Gandhi  ఎన్డీయే సర్కార్ కి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఇవాళ 19 పార్టీల నేతలతో వర్చువల్​గా సమావేశమయ్యారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ,తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌,నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా,ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఎల్జేడీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ కూడా ఈ మీటింగ్ కి హాజరైనవారిలో ఉన్నారు. అయితే ఆహ్వానం అందినప్పటికీ ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ఈ భేటీకి హాజరుకాలేదు. ఇక,మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి ఆహ్వానమే అందలేదు.

ఈ సందర్భంగా.. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోదీ స‌ర్కార్ ఓట‌మే ల‌క్ష్యంగా ముందుకుసాగాల‌ని విప‌క్ష నేత‌ల‌తో సోనియాగాంధీ పేర్కొన్నారు. పార్ల‌మెంట్‌లో క‌లిసిక‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన విప‌క్షాలు పార్ల‌మెంట్ వెలుప‌ల కూడా రాజ‌కీయ పోరును విస్తృతం చేయాల‌ని ఆకాంక్షించారు. 2024లో కేంద్రంలో రాజ్యాంగ విలువ‌ల ప‌ట్ల విశ్వాసం ఉండే ప్ర‌భుత్వ ఏర్పాటు దిశ‌గా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని, ఒక క్రమపద్ధతిలో ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉందని విపక్ష నేతలకు సోనియా దిశానిర్ధేశం చేశారు. ప్రతి ఒక్క పార్టీకి ఎవరి సిద్దాంతాలు వారికి ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి దేశ ప్రయోజనాల కోసం ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇదొక చాలెంజ్‌ అని.. ఐకమత్యాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదన్నారు. 2024 ఎన్నికలే అంతిమ లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పోరాడాలని సోనియా సూచించారు. ప్రతిపక్షాల ఐక్యత వల్ల ప్రభుత్వం వ్యాక్సినేషన్ పాలసీని మార్చుకుందన్న సోనియా… మూడు వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

సమాఖ్య వ్యవస్థను, రాజ్యాంగ సంస్థలను దెబ్బతీస్తున్నారంటూ మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తిన సోనియా.. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ఐక్యతను చాటినట్టుగానే పార్లమెంటు బయట కూడా అదే స్థాయిలో పోరాడాలన్నారు. ప్ర‌జా ప్రాధాన్య‌త క‌లిగిన అంశాల‌పై చ‌ర్చ‌కు నిరాక‌రిస్తూ మోదీ ప్ర‌భుత్వం నిరంకుశంగా, అహంకార‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు పూర్తిగా వృధా అయ్యాయ‌ని సోనియాగాంధీ అన్నారు. సభలో ప్రతిపక్షాలు అన్నీ ఒక తాటి మీదకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. పెగాసస్ వంటి వ్యవహారాలపై పెద్ద చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

మహారాష్ట్ర,వెస్ట్ బెంగాల్ వంటి బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ విషయంపై ఉద్ధవ్​ ఠాక్రే, మమతా బెనర్జీ ఇప్పటికే స్పందించినట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో జీవనోపాధి దెబ్బతిన్న వారికి ప్రత్యక్ష నగదు బదిలీ వంటి అత్యవసర చర్యల ఆవశ్యకతను వివరిస్తూ కాంగ్రెస్​ పార్టీ తరపున ఇప్పటికే పలుసార్లు ప్రధానమంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు.