Sonu Sood : ఈ సమయంలో నా తల్లిదండ్రులు బతికుంటే నా హృదయం ముక్కలయ్యేది, సోనూసూద్

Sonu Sood : ఈ సమయంలో నా తల్లిదండ్రులు బతికుంటే నా హృదయం ముక్కలయ్యేది, సోనూసూద్

Sonu Sood

Sonu Sood : కరోనా కష్టకాలంలో బాధితులకు ఆపద్బాంధవుడిలా మారాడు నేషన్ రియల్‌ హీరో సోనూసూద్‌. గతేడాది లాక్‌డౌన్‌ నుంచి సామాన్య ప్రజల కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నాడు. అడిగిన వారందరికి సాయం చేస్తున్నాడు. బెడ్లు, ఆక్సిజన్, మందులు.. ఇలా ఏది అడిగినా వెంటనే సాయం చేస్తున్నాడు. అందుకే, పేదలు ఆయనను దైవంలా చూస్తున్నారు.



తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనూసూద్ కన్నీటిపర్యంతం అయ్యాడు. తన తల్లిదండ్రులను తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. గతేడాదిలో పోలిస్తే కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని సోనూ వాపోయాడు. సరైన వసతుల్లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటే.. అది చూసి తాను చలించిపోయానన్నాడు.



‘కరోనా సెకండ్‌వేవ్‌లో దేశవ్యాప్తంగా పరిస్థితులు ఎంతో క్లిష్టంగా మారాయి. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులు నన్ను ఆవేదనకు గురి చేశాయి. తమ కుటుంబసభ్యుల్ని, ఆప్తులను, ప్రియమైన వారిని కోల్పోయి ప్రతిరోజూ ఎంతో మంది కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితులు చూశాక.. నా తల్లిదండ్రులు సరైన సమయంలో కన్నుమూశారని భావిస్తున్నా. ఒకవేళ వాళ్లే కనుక ఇప్పుడు బతికి ఉండి ఉంటే.. ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే.. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క.. ఆక్సిజన్‌ దొరక్క వాళ్లు పడే ఇబ్బంది చూసి నా హృదయం ముక్కలయ్యేది’ అని సోనూసూద్ ఆవేదన చెందాడు.



‘లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులకు నాకు చేతనైన సాయం అందించాను. అసలైన సంతోషమంటే ఏమిటో దానివల్ల నాకు తెలిసివచ్చింది. ఇప్పటికైనా రాజకీయ నాయకులందరూ ఒకరిపై ఒకరు బురద చల్లుకునే ప్రయత్నాలు మాని ఐక్యంగా కలిసి ప్రజలకు సాయం అందించాలి’ అని సోనూ కోరాడు.



కాగా, సోనూ తండ్రి శక్తి సాగర్ సూద్ పంజాబ్ లో వ్యాపారం చేసేవారు. ఆకలితో ఉన్న వారికి సోనూతో కలిసి సాయం చేసేవారు. ఇక సోనూ తల్లి సరోజ్ కూడా పేదలకు ఉచితంగా చదువు చెప్పేవారు. అనారోగ్య కారణాలతో సోనూ తల్లిదండ్రులు కొంతకాలం క్రితం కన్నుమూశారు.