ముగిసిన సోనియా గాంధీ పదవీకాలం.. త్వరలోనే కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షులు

  • Published By: vamsi ,Published On : August 10, 2020 / 09:31 AM IST
ముగిసిన సోనియా గాంధీ పదవీకాలం.. త్వరలోనే కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షులు

135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలు చర్చలు గట్టిగానే జరుగుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా ఉన్న సోనియా గాంధీ పదవీకాలాన్ని మరికొంత పొడిగిస్తారనే ప్రచారంపై ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది.



పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక త్వరలో ఉంటుందని పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఆ ప్రక్రియ ముగిసేవరకూ సోనియా గాంధీ ఈ పదవిలో కొనసాగుతారని వెల్లడించింది. పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా అధ్యక్షుడి ఎంపిక ఇంకా పూర్తికానందున పార్టీ తాత్కాలిక చీఫ్‌గా ఆమె పదవీకాలం పొడిగించినట్లు కాంగ్రెస్ చెప్పింది. త్వరలోనే కొత్త అధ్యక్షులు రాబోతున్నట్లు ఆ పార్టీ నాయకులు అభిషేక్ మను సింగ్వి అన్నారు.



ఇవాళ(ఆగస్టు 10 న సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్ష పదవీకాలం ముగియబోతోంది. అయితే తదుపరి అధ్యక్షుని ప్రకటించేవరకు ఆమెనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉండనున్నారు. కొత్త అధ్యక్షుడి కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) తగిన ప్రక్రియను అనుసరిస్తుంది.



గత ఏడాది ఆగస్టు 10 న సోనియా గాంధీ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించబడ్డారు. అంతకుముందు సోనియా గాంధీ 1998 నుండి 2017 వరకు కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారు, ఆ తర్వాత రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షునిగా చేశారు. 2019 సార్వ్తత్రిక ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో పార్టీ చీఫ్‌గా రాహుల్‌ గాంధీ వైదొలగిన సంగతి తెలిసిందే.



పార్టీ చీఫ్‌గా కొనసాగాలని కాంగ్రెస్‌ శ్రేణులు కోరినా రాహుల్‌ దిగిరాకపోవడంతో సోనియా గాంధీకి గత ఏడాది ఆగస్ట్‌ 9న తాత్కాలిక చీఫ్‌ బాధ్యతలను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కట్టబెట్టింది. సోనియా నియామకం అనంతరం మహారాష్ట్ర, హరియాణ, జార్ఖండ్‌, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అనంతరం కోవిడ్‌-19 వ్యాప్తితో నూతన అధ్యక్షుడి ఎన్నికలో జాప్యం జరుగుతోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.