బీజేపీకి బ్యాడ్ న్యూస్ : ఎస్పీ బీఎస్పీ పొత్తు

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 04:41 PM IST
బీజేపీకి బ్యాడ్ న్యూస్ : ఎస్పీ బీఎస్పీ పొత్తు

లక్నో: వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ జట్టు కట్టేందుతు సిద్ధమయ్యాయి. సీట్ల పంపకానికి సంబంధించి రెండు పార్టీల మధ్య చర్చ మొదలైంది. ఎస్పీ-బీఎస్పీ కూటమిగా ఏర్పడే అవకాశం కనిపిస్తుండడంతో కాంగ్రెస్‌ పార్టీకి ఒంటరి పోరు తప్పేలా కనిపించడం లేదు. ఎస్పీ-బీఎస్పీ కూటమితో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి గట్టిపోటీ ఎదురు కానుంది.
సీట్ల షేరింగ్‌పై చర్చలు:
ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌వాది పార్టీలు మరింత చేరువవుతున్నాయి. ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌ యాదవ్‌ ప్రతిపాదిత కూటమిపై తుది చర్చలు జరిపేందుకు ఢిల్లీలోని బీఎస్పీ చీఫ్‌ మాయావతి ఇంటికి స్వయంగా వెళ్లారు. వీరిద్దరు సుమారు 2 గంటలపాటు చర్చలు జరిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యమైన నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా వీరి మధ్య చర్చకు వచ్చాయి. రెండు పార్టీలు సీట్లు సమానంగా పంచుకోవాలని కూడా వీరు ఓ నిర్ణయానికి వచ్చారు.
చెరో 37 స్థానాలు:
ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ సీట్లుండగా ఎస్పీ-బీఎస్పీ చెరో 37 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మిగిలిన 6 సీట్లను కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌దళ్‌ వంటి పార్టీలకు వదిలేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు అమేథీ, రాయ్‌బరేలీ సీట్లు ఇచ్చే ఛాన్సుంది.
కమలానికి కష్టమే:
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో ఎస్పీ-బీస్పీ కలిసి పోటీ చేయడం ద్వారా బీజేపీకి ఓటమి తప్పలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములాతో ముందుకు పోవాలని రెండు పార్టీలు నిర్ణయించడంతో బీజేపీకీ భారీగా నష్టం కలిగే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో యూపీలో బీజేపీ 80సీట్లకు గాను 72 స్థానాలను గెలుచుకుంది. ఉప ఎన్నికల్లో 3 లోక్‌సభ స్థానాలకు కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని తమ కూటమిలోకి చేర్చుకునేందుకు బీఎస్పీ, ఎస్పీ విముఖత చూపాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీ యూపీలో ఒంటరిగానే పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది.