త్వరలో భారత్‌లో అందుబాటులోకి ‘స్పుత్నిక్‌ వీ’ టీకా!

త్వరలో భారత్‌లో అందుబాటులోకి ‘స్పుత్నిక్‌ వీ’ టీకా!

‘Sputnik V’ vaccine : దేశంలో మరో టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్‌ వీ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలా.. వద్దా అనే దానిపై ఇవాళ నిపుణుల కమిటి భేటీ కానుంది. స్పుత్నిక్‌ వి అత్యవసర వినియోగానికి అనుమతి కోసం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ గత వారం డీసీజీఐకు దరఖాస్తు చేసుకుంది. ఫేజ్‌-2 క్లినికల్‌ పరీక్షల సమాచారాన్ని, ఫేజ్‌-3 క్లినికల్‌ పరీక్షలకు సంబంధించిన మధ్యంతర సమాచారాన్ని భారత ఔషధ నియంత్రణ మండలికి అందించింది.

రష్యాకు చెందిన డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంస్థ స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ టీకాను భారతలో విక్రయించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌తో రష్యన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. మధ్యంతర సమాచారం ప్రకారం ఈ టీకా 91.6 శాతం ప్రభావశీలత కలిగి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రపంచ వ్యాప్తంగా 90 శాతానికి పైగా ప్రభావశీలత కలిగిన మూడు టీకాల్లో స్పుత్నిక్‌ వి టీకా ఒకటి.

దీనికి ప్రపంచ వ్యాప్తంగా 26 దేశాల్లో అనుమతులు వచ్చాయి. ఇప్పటికే 20 లక్షలపైగా మందికి ఈ టీకా ఇచ్చారు. ఇప్పుడు భారత కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో డీసీజీఐ అనుమతివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.