SSLV-D1 Rocket launch: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి అభివృద్ధి చేసిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వీ డీ1) ఆదివారం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.

SSLV-D1 Rocket launch: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

SSLV-D1/EOS-02 mission

SSLV-D1 Rocket launch: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి అభివృద్ధి చేసిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వీ డీ1) ఆదివారం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం 9.18గంటలకు రాకెట్ నింగిలోకి ఎగిరింది. 13.2 నిమిషాల్లో ప్రయోగం విజయవంతంగా పూర్తయింది.

ఎస్ఎస్ఎల్‌వీ నింగిలోకి ఈవోఎస్-2, ఆజాదీశాట్ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. ఈవోఎస్-2 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని పరిశీలిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడంలో సాయపడుతుంది. అదేవిధంగా ఆజాదీశాట్ ను కూడా ఎస్ఎస్ఎల్వీ నింగిలోకి తీసుకెళ్లింది. 75వ స్వాతంత్ర వార్షికోత్సవం, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కు గుర్తుగా దీనికి ఆజాదీశాట్ అని పేరు పెట్టారు. దీని బరువు ఎనిమిది కిలోలు.

ఆజాదీశాట్ ను విద్యార్థులు తీర్చిదిద్దారు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు దీన్ని రూపొందించారు. ఇందులో రవీంద్రనాథ్ ఠాగూర్ పాడిన జాతీయ గీతం రికార్డ్ వెర్షన్ ను పొందుపర్చారు. ఈ ఆజాదీశాట్ ఆరు నెలలు పనిచేస్తుంది. ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావటంతో శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభినందించారు.