హాస్పిటళ్లుగా మారుతున్న హోటళ్లు.. కరోనా రోగుల కోసం 20వేల బెడ్లు రెడీ

  • Published By: vamsi ,Published On : June 15, 2020 / 02:36 AM IST
హాస్పిటళ్లుగా మారుతున్న హోటళ్లు.. కరోనా రోగుల కోసం 20వేల బెడ్లు రెడీ

దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకి కేసులు పెరిగిపోవడం, హాస్పిటళ్లలో బెడ్లు కొరత కారణంగా.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో 20వేల బెడ్లను రెడీ చేసేందుకు చర్యలు చేపట్టింది. హోటల్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌లో బెడ్లను ఏర్పాటు చేస్తుంది. 

కోవిడ్ రోగుల కోసం 10 జిల్లాల్లో 77 ఫంక్షన్ హాళ్లను ప్రభుత్వం గుర్తించింది. ఇక్కడ 11,229 పడకలు ఉంచవచ్చు. అలాగే 4,628 పడకల సామర్థ్యం కలిగిన 40 హోటళ్ళు కూడా ప్రైవేట్ ఆసుపత్రులతో అనుసంధానించడానికి కేటాయించింది ప్రభుత్వం. 10 నుంచి 49 బెడ్లు ఉన్న నర్సింగ్‌ హోమ్‌లు కూడా కరోనా పేషంట్ల కోసం రిజర్వ్‌ చేసినట్లు చెప్పారు. దీంతో నర్సింగ్‌ హోమ్‌లలో మొత్తం 5వేల బెడ్లు అందుబాటులోకి వచ్చాయి.

అధికారిక రికార్డుల ప్రకారం.. ఇప్పటికే కొన్ని హోటల్స్‌లో కరోనా ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌ చేశారని, జిల్లా అధికారులు వాటిని పర్యవేక్షిస్తున్నాయి. దాని కోసం ప్రత్యేక గైడ్‌ లైన్స్‌ విధించింది ప్రభుత్వం. ఢిల్లీలో ఇప్పటివరకు దాదాపు 38 వేల కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండగా.. జులై చివరి నాటికి 5.5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా వెల్లడించారు. ఈ క్రమంలోనే బెడ్లు కొరత రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.

ఢిల్లీ ప్రభుత్వం గుర్తించిన ప్రధాన హోటళ్లలో సివిల్ లైన్స్‌లోని హోటల్ ఒబెరాయ్ మైడెన్స్, వసంత విహార్‌లోని హోటల్ హయత్ రీజెన్సీ మరియు పస్చిమ్ విహార్‌లోని రాడిసన్ బ్లూ ఉన్నాయి. ఐదు ప్రీమియర్ హోటళ్లను ఆసుపత్రులుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం మే 29 న ఆదేశించింది. ఈ చర్యకు వ్యతిరేకంగా హోటళ్లలో ఒకటి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ విషయం పెండింగ్‌లో ఉంది. 

వీటితో పాటు ఢిల్లీ ప్రభుత్వం భారతీయ రైల్వేలోని 500 కోవిడ్ ఐసోలేషన్ కోచ్‌లను కూడా ఉపయోగిస్తుంది. బాంకెట్ హాల్స్‌లో బస చేయడం ఉచితం కాదా అనే దానిపై ఇంకా మాటలు లేనప్పటికీ, హోటళ్లలో సౌకర్యాలు పొందే వారు మూడు లేదా నాలుగు నక్షత్రాల కేటగిరీ హోటళ్ల విషయంలో వారానికి 60,000 రూపాయలకు పైగా మరియు ఫైవ్‌స్టార్ హోటళ్ల విషయంలో రూ.70వేల రూపాయలు కట్టవలసి ఉందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే సిబ్బంది కొరత ఇందులో ఎక్కువగా ఉంది. ఏసీలు పనిచేయట్లేదు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి.