మీ ఇంటి అద్దె మేం కడతాం…ఊర్లకు పోవద్దు : వలస కార్మికులకు కేజ్రీవాల్ హామీ

  • Published By: venkaiahnaidu ,Published On : March 29, 2020 / 02:46 PM IST
మీ ఇంటి అద్దె మేం కడతాం…ఊర్లకు పోవద్దు : వలస కార్మికులకు కేజ్రీవాల్ హామీ

వలస కార్మికులు తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళే బదులుగా,ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఇప్పటి వరకు గ్రామాలకు చేరుకోని కరోనా వైరస్,గ్రామాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేజ్రీవాల్ తెలిపారు. ఇద్దరు లేదా నలుగురికి కరోనా ఉంటే, వారు ఇతరులకు వ్యాపిస్తారు. మీకు కూడా సోకుతుంది. మీరు మీ గ్రామానికి వెళితే, మీ గ్రామస్తులు వైరస్ బారిన పడతారు. ఇది దేశంలో పూర్తిగా వ్యాపిస్తే, దానిని నియంత్రించడం చాలా కష్టమైన పని అవుతుందని ఆయన అన్నారు. అవసరమైన అన్నివిధాలుగా సాయం చేస్తామని కేజ్రీవాల్ వలస కార్మికులకు హామీ ఇచ్చారు.

ఒకవేళ వాళ్లలో ఎవరైనా అద్దె చెల్లించలేకపోతే.. వారి అద్దెను ప్రభుత్వమే చెల్లించనున్నట్లు కేజ్రీవాల్ వాగ్ధానం చేశారు. ఈ సంక్షోభంలో ప్రజలు తమను మరియు తమ ప్రియమైనవారి గురించి ఆలోచించాలని మరియు వైరస్ వ్యాప్తి కాకుండా చేయాలని ఆయన అన్నారు. మీరు ఉండటానికి మేము ఏర్పాట్లు చేసాము. పాఠశాలల్లో నిద్ర ఏర్పాట్లు చేయబడ్డాయి. ఒక స్టేడియం మొత్తం ఖాళీ చేయబడింది. కమ్యూనిటీ కిచెన్ల ద్వారా పేదలకు ఆహారం ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ అంతటా కనీసం 10 కమ్యూనిటీ వంటశాలలు పనిచేస్తున్నాయి. అంతేకాకుండా, పాఠశాల పిల్లలకు మధ్యాహ్నం భోజనం వండిన అన్ని వంటశాలలు, అవసరమైనవారికి ఆహారాన్ని సిద్ధం చేయడానికి మార్చబడ్డాయి అని కేజ్రీవాల్ తెలిపారు.

చాలా మంది ప్రజలు అనేక రాష్ట్రాల్లోని తమ స్వస్థలాలకు తిరిగి వెళుతున్నారు అని కేజ్రీవాల్ అన్నారు. నమస్కరించి నేను వారికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను – ప్రధానమంత్రి లాక్ డౌన్ ప్రకటించినప్పుడు, ‘జో జహాన్ హై వో వాహి రహే (దయచేసి మీరు ఎక్కడున్నవాళ్లు అక్కడే ఉండిపోండి)’ అని అన్నారు. ఇది లాక్ డౌన్ మంత్రం. మనం దీనిని పాటించకపోతే, కరోనా వైరస్ వ్యతిరేక పోరాటంలో మనం, దేశం విఫలమవుతాము అని కేజ్రీవాల్ వలస కార్మికులకు విజ్ణప్తిచేశారు.

లాక్ డౌన్ కారణంగా పనులు లేక చేతిలో డబ్బులు లేకపోవడం వలస కార్మికులు గ్రామాలకు వెళ్లేందుకు ఒక ప్రధాన కారణంగా మారింది. తమ ఇంటి ఓనర్లు తమను వెళ్లగొట్టారని చాలామంది తెలిపారు. ఈ లాక్ డౌన్ సమయంలో ఇంటి అద్దెను కూలీల నుండి డిమాండ్ చేయరాదని, కార్మికులు లేదా విద్యార్థులను ప్రాంగణం నుండి ఖాళీ చేయమని అడుగుతున్న వారిపై చర్యలు తీసుకోబడతాయని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ గా అమలుచేయాలని ఆదివారం(మార్చి-29,2020)అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ఈమేరకు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో వలసకూలీలు.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నట్లుగా గుర్తించామని దీనిని పూర్తిగా నివారించాలని కేంద్రం స్పష్టం చేసింది.

రాష్ట్రాల మధ్య సరిహద్దులు,జిల్లాల మధ్య పూర్తిగా మూసివేయాలని.. కేవలం సరకు రవాణాకు మాత్రమే అనుమతించాలని చెప్పింది. ఎక్కడైనా ప్రజలు ప్రయాణాలు చేస్తే దానికి స్థానిక కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణాలు చేసినవారిని 14 రోజులపాటు తప్పకుండా క్వారంటైన్‌లో ఉంచాలని తెలిపింది.