2నెలలకు సరిపడ వంట గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచుకోవాలని ఆదేశాలు, భయాందోళనలో ప్రజలు, జమ్మూకాశ్మీర్‌లో అసలేం జరుగుతోంది

2నెలలకు సరిపడ వంట గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచుకోవాలని ఆదేశాలు, భయాందోళనలో ప్రజలు, జమ్మూకాశ్మీర్‌లో అసలేం జరుగుతోంది

2 నెలలకు సరిపడ గ్యాస్ సిలిండర్లను స్టాక్ ఉంచుకోండి. భద్రతా బలగాల వసతి కోసం స్కూల్ భవనాలను సిద్ధం చేయండి.. అంటూ జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం ఆయిల్ కంపెనీలకు, పోలీసు ఉన్నతాధికారులకు జారీ చేసిన ఆదేశాలు కలకలం రేపాయి. ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. జమ్మూకాశ్మీర్ లో ఏం జరగనుంది? అని అంతా కంగారుపడ్డారు. అసలే చైనా, భారత్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తూర్పు లద్దాఖ్ లోని గాల్వన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల హింసాత్మక ఘర్షణ తర్వాత ఉద్రిక్తత మరింత పెరిగింది. మరోవైపు సరిహద్దుల్లో పాకిస్తాన్ తరుచుగా కాల్పులకు తెగబడుతోంది. ఈ పరిస్థితుల్లో అధికారులు జారీ చేసిన ఈ ఆదేశాలు మరింత టెన్షన్ పెట్టాయి. చైనాతో యుద్ధానికి భారత్ రెడీ అవుతోందా? పాక్ పై మరోసారి దాడి చేయనుందా? అనే అనుమానాలు రేకేత్తించాయి.

బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులకు ముందు ఇలాంటి ఆదేశాలే ఇచ్చారు:
గత ఏడాది (2019) పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడి చేయడానికి ముందు కూడా అధికారులు ఇలాంటి ఆదేశాలే జారీ చేశారని ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే సమయంలోనూ అధికారులు ఇలాంటి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మరోసారి అలాంటి తరహా ఆర్డర్స్ ఇవ్వడంతో ఏదో జరగబోతోందని ప్రజలు వర్రీ అవుతున్నారు.

ప్రజలను ఎందుకు భయపెడుతున్నారు?
ఈ ఆదేశాలపై విపక్షాలు కూడా మండిపడ్డాయి. అధికారుల ఆదేశాలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. అసలు మీ ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పండి, దీనిపై వివరణ ఇవ్వండి, ఏం చేయబోతున్నారో క్లారిటీ ఇచ్చి, ప్రజల్లో ఆందోళన తొలగించండి అంటూ ట్వీట్ లో డిమాండ్ చేశారాయన.

ఎల్పీజీ నిల్వ చేయాలని చెప్పడానికి కారణం ఇదే:
ఎల్పీజీ స్టాక్, స్కూల్ భవనాల సిద్ధంకి సంబంధించి ప్రజల్లో ఆందోళన వ్యక్తం కావడంతో ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. దీనిపై స్పష్టత ఇచ్చాయి. ఎవరూ భయపడాల్సిన పని లేదని అన్నారు. రానున్నది శీతాకాలం. దాన్ని దృష్టిలో ఉంచుకుని వంట గ్యాస్ సిలిండర్లు స్టాక్ లో ఉంచుకోవాలని చెప్పాము. అంతే తప్ప మరో కారణం లేదు అని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు ఫరూక్ ఖాన్ చెప్పారు. దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వాల్సిందిగా వినియోగదారు వ్యవహారాల డైరెక్టర్ ని ఆదేశిస్తామని ఆయన వెల్లడించారు.

అమర్ నాథ్ యాత్ర విధులకు వచ్చే భద్రతా బలగాల వసతి కోసం:
ఇక స్కూల్ భవనాలను సిద్దం చేయాలన్న దానిపైనా పోలీసు ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. దాని కోసం డ్యూటీలో పాల్గొనేందుకు భద్రతా దళాలు వస్తున్నాయి. వారికి వసతి కల్పించేందుకు స్కూల్ భవనాలు సిద్ధం చేస్తున్నాం అంతే అని పోలీసు ఉన్నతాధికారి వివరణ ఇచ్చారు.