ప్రచారాన్ని ఆపండి – రతన్ టాటా

ప్రచారాన్ని ఆపండి – రతన్ టాటా

Stop the campaign – Ratan Tata : ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటాకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో… వాటిపై ఆయన స్పందించారు. ఆ ప్రచారాన్ని ఆపాలంటూ నెటిజన్లను కోరారు. అవార్డుల కంటే దేశానికి సేవ చేసే అవకాశం రావడమే తాను అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. డాక్టర్‌ వివేక్‌ భింద్రా అనే ఓ మోటివేషనల్‌ స్పీకర్‌ తన ట్విటర్‌ ఖాతాలో రతన్‌ టాటా గురించి ఓ ట్వీట్‌ చేశారు. పారిశ్రామిక రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ టాటాకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని.. అందుకోసం తమ ప్రచారంలో చేరాలని పిలుపునిచ్చారు.

దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. రతన్‌టాటా భారతరత్నకు అర్హులంటూ ఆయన అభిమానులు, నెటిజన్లు వేల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై రతన్‌ టాటా స్పందించారు. ఇలాంటి ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. దేశాభివృద్ధి, శ్రేయస్సు కోసం నావంతు సహకారం అందించే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తానంటూ ట్వీట్‌ చేశారు. భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నానని, దేశ ప్రగతికి సహకరించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటానన్నారు.