లక్షల జీతం వదులుకుని.. 6th సివిల్స్ ర్యాంకు కొట్టిన ASI కూతురు

  • Published By: vamsi ,Published On : August 5, 2020 / 07:32 AM IST
లక్షల జీతం వదులుకుని.. 6th సివిల్స్ ర్యాంకు కొట్టిన ASI కూతురు

సివిల్ సర్వీస్ పరీక్షల్లో దేశ రాజధాని ఢిల్లీకి చెందిన విశాఖ యాదవ్ ఆరో ర్యాంకు సాధించారు. విశాఖ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. బెంగళూరులోని ఒక మల్టీ నేషనల్ కంపెనీలో రెండున్నరేళ్లు పనిచేసిన తరువాత, సివిల్ సర్వీసు కోసం సన్నాహాలు ప్రారంభించారు. జీతం లక్షల్లో ఉన్నా కూడా వదులుకుని ఐఎఎస్ అధికారి కావాలన్నది ఆమె కల. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆమె ఉద్యోగాన్ని వదిలి ఢిల్లీకి తిరిగి వచ్చి సివిల్స్‌కు సిద్ధమయ్యారు.



విశాఖ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ నుండి బి.టెక్ పూర్తి చేసింది. విశాఖ యాదవ్ మొదటి రెండు సార్లు ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదు. కానీ ఆమె ఎప్పుడూ ఒత్తిడికి లోనుకాకుండా కుటుంబం మద్దతుతో ధైర్యంగా ముందుకు సాగింది.

విశాఖ తండ్రి రాజ్ కుమార్ యాదవ్, అసిస్టెంట్ సబ్ ఇన్స్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్నారు. విశాఖ విజయంపై ఆయన మాట్లాడుతూ.. తన కుమార్తె పదవ తరగతి, పన్నెండో తరగతులలో కూడా అగ్రస్థానంలో నిలిచిందని, బీ.టెక్ చేసిన తరువాత, మిలియన్ల ప్యాకేజీ వచ్చినా ఉద్యోగాలు, విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చినా కూడా ఆఫీసర్ కావాలని నిశ్చయించుకుందని వెల్లడించారు.



ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఫిరోజ్ ఆలం కూడా సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 645 ర్యాంకు సాధించారు. ఫిరోజ్ ప్రస్తుతం పిసిఆర్ యూనిట్‌లో పనిచేస్తున్నారు. ఫిరోజ్‌తో పాటు ఢిల్లీ పోలీసు ఇన్‌స్పెక్టర్ కుమార్తె నవనీత్ మన్ కూడా 33 వ ర్యాంకు సాధించారు.

యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ పరీక్ష 2019 లో ఆరో ర్యాంకు సాధించిన ఢిల్లీ పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కుమార్తెను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అభినందించారు. ఐఎఎస్, ఐపిఎస్‌లతో సహా మొత్తం 829 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసులకు అర్హత సాధించినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) మంగళవారం ప్రకటించింది.



ప్రదీప్ సింగ్, జతిన్ కిషోర్, ప్రతిభ వర్మ వరుసగా మొదటి, రెండవ, మూడవ స్థానాలను దక్కించుకున్నారు.