ASER REPORT : చూసి కూడా చదవలేకపోతున్న పిల్లలు .. లెక్కలంటే బిక్కమొహాలేస్తున్న విద్యార్ధులు

పిల్లలకు చదవడం రావట్లేదు, చిన్నపాటి లెక్కలూ చేయట్లేదు. చివరికి మాతృభాషలోని అక్షరాలనూ గుర్తించటం లేదు. ఇక.. తీసివేతలు, భాగాహారాల గురించి.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే.. అంత మంచిది. అంకెలను కూడా గుర్తించలేకపోతున్నారు.ASER REPORT వెల్లడించిన వివరాలు పిల్లల చదువుల పరిస్థితిని అద్దంపడుతోంది

ASER REPORT : చూసి కూడా చదవలేకపోతున్న పిల్లలు .. లెక్కలంటే బిక్కమొహాలేస్తున్న విద్యార్ధులు

2022 ASER report

ASER REPORT : పిల్లలకు చదవడం రావట్లేదు, చిన్నపాటి లెక్కలూ చేయట్లేదు. చివరికి మాతృభాషలోని అక్షరాలనూ గుర్తించటం లేదు. ఇక.. తీసివేతలు, భాగాహారాల గురించి.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే.. అంత మంచిది. అంకెలు తెలియని వాళ్లు కూడా తక్కువేమీ లేరు. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి దాకా.. ప్రతి క్లాస్‌లో ఇలాంటి పిల్లలు ఉన్నారని.. అసర్ రిపోర్ట్ తేల్చింది. దీంతో.. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారమంతా ఉత్తిదేనని తేలిపోయింది. ప్రాథమిక విద్యా ప్రమాణాలు ఇంత దారుణంగా పడిపోవటానికి కారణమేంటి?

దేశంలో.. ఈ మూల నుంచి ఆ మూల దాకా.. ఏ ప్రభుత్వ పాఠశాలను తీసుకున్నా.. ఇదే పరిస్థితులు ఉన్నట్లు తేల్చింది అసర్ రిపోర్ట్. అక్కడో.. ఇక్కడో ఎందుకు.. మన తెలుగు విద్యార్థుల గురించే తెలుసుకుందాం. అందరి మాతృ భాష తెలుగే అయినా.. కొందరికి తెలుగు చదవడమే రావట్లేదు. ఇంకొందరు.. తెలుగు అక్షరాలను కూడా గుర్తు పట్టడం లేదు. పోనీ.. ఇంగ్లీషేమైనా ఇరగదీస్తున్నారా? అంటే.. అదీ లేదు. తెలుగు చదవడంలో.. రెండు రాష్ట్రాల విద్యార్థులు కొంత వెనుకబడినట్లు తెలుస్తోంది. ప్రముఖ రీసెర్చ్ ఆర్గనైజేషన్.. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్.. అసర్ రిలీజ్ చేసిన రిపోర్టులో.. ఈ విషయాలు బయటపడ్డాయి. ఆ సర్వే ప్రకారం.. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి దాకా చాలా మంది పిల్లలు.. చదువులో బాగా వెనుకబడిపోయినట్లు తేలింది. దాదాపు ప్రతి తరగతిలోనూ తెలుగు కంటే ఇంగ్లీషులో విద్యార్థులు కొంత మెరుగ్గా ఉన్నారు.

మూడో తరగతి స్టూడెంట్స్ విషయానికొస్తే.. అక్షరాలు చదవగలుగుతున్నా.. పదాలు చదవలేకపోతున్నారు. పదాలు చదివే వాళ్లు.. ఒక మోస్తరు వాక్యాలను, పేరాలను చదవలేని స్థితిలో ఉన్నారు. ఇక.. గణితం విషయానికొస్తే.. మూడో తరగతి విద్యార్థుల్లో చాలా మందికి అంకెలు కూడా గుర్తించలేకపోతున్నారు. 99 దాకా అంకెలే తెలియడం లేదు. సగానికి సగం పిల్లలు.. తీసివేతలు చేయలేకపోతున్నారు. మెజారిటీ విద్యార్థులకు భాగాహారాలు ఎలా చేయాలో కూడా తెలియడం లేదని.. అసర్ రిపోర్ట్ తేల్చింది. చివరికి.. ఎనిమిదో తరగతిలోనూ.. అంకెలు గుర్తించలేని విద్యార్థులున్నారు. ఇంగ్లీషు పదాలు చదవలేకపోతున్న విద్యార్థుల శాతం కూడా భారీగానే ఉంది. సులభమైన పదాలు గుర్తించడంలోనూ పిల్లలు బాగా వెనుకబడిపోయారు. ఈజీ వర్డ్స్ తెలిసినా.. సులభమైన వాక్యాలు తెలియని పిల్లలు కూడా ఎంతో మంది ఉన్నారు. దీంతో.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారం.. కొన్ని పాఠశాలలకే పరిమితమైందని అర్థమవుతోంది.

ASER REPORT : కోవిడ్‌ దెబ్బ..చదువుల్లో దారుణంగా వెనుకబడిన స్కూల్ విద్యార్ధులు, రేపటి పౌరుల భవిష్యతుపై ఆందోళన కలిగిస్తున్న ASER రిపోర్ట్

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని.. ప్రభుత్వాలు చెబుతున్నా.. చాలా మంది ప్రైవేటుగా ట్యూషన్లకు వెళ్తున్నారని తేల్చింది అసర్ రిపోర్ట్. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి దాకా.. కనీసం 15 శాతం మంది విద్యార్థులు డబ్బులు చెల్లించి ట్యూషన్లలో పాఠాలు చెప్పించుకుంటున్నారు. ఓవరాల్‌గా.. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో.. 30 శాతానికి పైగా ప్రైవేట్ ట్యూషన్లు చెప్పించుకుంటున్నారని తేల్చారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం.. 2018తో పోల్చుకుంటే 2022లో దారుణంగా పడిపోయింది.

దేశవ్యాప్తంగా.. అన్ని రాష్ట్రాల్లో 7 లక్షల మంది విద్యార్థులతో సర్వే నిర్వహించారు. దాని ప్రకారం.. మూడో తరగతి విద్యార్థులు.. రెండో తరగతి పాఠాలను తప్పుల్లేకుండా చదవగలిగే వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నట్లు తేల్చారు. 5, 8వ తరగతి విద్యార్థులు కూడా తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు. మ్యాథ్స్‌లోనూ చాలా మంది విద్యార్థులు వెనుకబడిపోయారని తేలింది. సక్రమంగా లెక్కలు చేసే స్టూడెంట్స్.. ప్రతి క్లాసులో చాలా తక్కువగా ఉన్నారు. 2012, 2014, 2016లో నిర్వహించిన సర్వేలతో పోలిస్తే.. గతేడాది చేసిన సర్వేలో.. విద్యార్థుల అభ్యసన ప్రమాణాలు బాగా పడిపోయాయ్. ప్రతిరోజూ పాఠశాలలకు హాజరైన వారి సంఖ్య కూడా 72 శాతమే. నాలుగో వంతు మంది విద్యార్థులు.. ఏదో ఒక కారణంతో.. స్కూళ్లకు వెళ్లడం లేదు. అయితే.. హాజరుశాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది.

ఇక.. అతి చిన్న ఇంగ్లీష్ వాక్యాలను కూడా విద్యార్థులు చదవలేకపోతున్నట్లు సర్వేలో తేలింది. ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో.. వేర్ ఈజ్ యువర్ హౌజ్, ఐ లైక్ టు ప్లే లాంటి వాక్యాలను చదివి.. అర్థం చెప్పలేని వారు 37 శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 14 శాతం బడుల్లో తాగునీటి సౌకర్యం లేదని, 20 శాతం పాఠశాలల్లో సదుపాయం ఉన్నా తాగునీరు లేదని అసర్ నివేదిక తెలిపింది. పద్నాలుగున్నర శాతం పాఠశాల్లో మరుగుదొడ్లు ఉన్నా.. అవి నిరుపయోగంగా ఉన్నాయని తెలిపింది. 20 శాతం పాఠశాలల్లో లైబ్రరీలు లేవని, 76 శాతం స్కూళ్లలో కంప్యూటర్లు లేవని.. 19 శాతం బడుల్లో పీఈటీలు లేరని అసర్ నివేదిక వివరించింది.