New CBI Director : సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్‌ ఎవరు ? కేసు డీల్ చేశారంటే..అంతుచూసే దాకా విడిచిపెట్టరు

ఆయన మామూలోడు కాదు.. ఓ కేసు డీల్‌ చేశారంటే... అంతు చూసే దాకా విడిచిపెట్టరు. అలాంటి చండశాసనుడిని ఏరికోరి ఇప్పుడు కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థకు బాస్‌గా నియమించింది కేంద్ర సర్కార్‌.

New CBI Director : సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్‌ ఎవరు ? కేసు డీల్ చేశారంటే..అంతుచూసే దాకా విడిచిపెట్టరు

Subodh Kumar Jaiswal

Subodh Kumar Jaiswal: ఆయన మామూలోడు కాదు.. ఓ కేసు డీల్‌ చేశారంటే… అంతు చూసే దాకా విడిచిపెట్టరు. అలాంటి చండశాసనుడిని ఏరికోరి ఇప్పుడు కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థకు బాస్‌గా నియమించింది కేంద్ర సర్కార్‌. మూడు నెలలుగా పూర్తి స్థాయి బాస్‌ లేకుండా నెట్టుకొచ్చిన సీబీఐకి ఎట్టకేలకు కొత్త బాస్‌ వచ్చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ కొత్త డైరెక్టర్‌గా మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్‌ నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, లోక్‌సభలో విపక్షనేత అధీర్‌రంజన్‌ చౌధురిలతో కూడిన త్రిసభ్య కమిటీ 109 మంది జాబితా నుంచి వడబోతతసి జైశ్వాల్‌ను ఎంపిక చేసింది.

విధుల నిర్వహణలో ఎవరినీ లెక్క చేయరనే పేరు సుబోధ్‌ జైశ్వాల్‌కు ఉంది. గత ఏడాది మహారాష్ట్ర డీజీపీగా ఉన్నప్పుడు అప్పటి రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌తో విభేదించారు. రెండేళ్లు పూర్తి కాకుండా ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అది చట్ట విరుద్ధమని వాదించారు. కొన్ని బదిలీలపై సంతకాలు చేసేందుకు సుబోధ్‌ నిరాకరించి సంచలనం సృష్టించారు. అప్పుడు తనకు బాస్‌గా దేశ్‌ముఖ్‌ అవినీతి ఆరోపణలతో మంత్రి పదవి నుంచి వైదొలిగారు. కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు ఆ కేసులపై సుబోధ్‌ విచారణ జరపనున్నారు.

1985 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన సుబోధ్‌ జైశ్వాల్‌.. ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో అత్యంత కీలకమైన రీసర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌లో కూడా జైశ్వాల్‌కు తొమ్మిదేళ్ల అనుభవం ఉంది. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన జైశ్వాల్‌.. ఈ ఏడాది జనవరిలో డిప్యుటేషన్‌ మీద కేంద్ర సర్వీసులకు వచ్చారు. సీబీఐ డైరెక్టర్‌ పదవికి షార్ట్‌ లిస్టు చేసిన బిహార్‌ కేడర్‌కు చెందిన ఎస్‌ఎస్‌బీ డైరెక్టర్‌ జనరల్‌ కుమార్‌ రాజేష్‌చంద్ర, ఏపీ కేడర్‌ అధికారి వీఎస్‌కే కౌముది కంటే జైశ్వాలే అత్యంత సీనియర్‌ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన నియామకానికే మొగ్గు చూపింది.

గతంలో జైశ్వాల్‌.. మహారాష్ట్ర డీజీపీగా, దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముంబై పోలీసు కమిషనర్‌గా పని చేశారు. ఎస్‌పీజీ, ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌, మహారాష్ట్ర స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం, స్టేట్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌లోనూ సేవలందించారాయన. 2002లో సంచలనం సృష్టించిన నకిలీ స్టాంప్‌ పేపర్ల కుంభకోణం కేసును జైశ్వాలే దర్యాప్తు చేశారు. తెల్గీ కేసుగా ఇది గుర్తింపు పొందింది. మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న గడ్చిరోలి జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వివాదాస్పద ఎల్గార్‌ పరిషద్‌, బీమా కోరెగావ్‌ కుట్ర కేసులను కూడా సీబీఐకి అప్పగించక ముందు జైశ్వాలే పర్యవేక్షించారు. జులై 11, 2006లో చోటు చేసుకున్న వరుస రైలు బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో కీలకపాత్ర పోషించారు సుబోధ్‌. విధినిర్వహణలో ప్రతిభ చూపినందుకుగాను 2001లో రాష్ట్రపతి పోలీసు మెడల్‌ను అందుకున్నారాయన. 2020లో కేంద్ర ప్రభుత్వం నుంచి అసాధారణ్‌ సురక్షా సేవా ప్రమాణ్‌ పత్ర్‌ అందుకున్నారు.

Read More : Covid-19 Disease : కొత్త సమస్య, బ్లడ్ లో తెల్ల రక్తకణాలు పడిపోతే ?