అరసవల్లిలో అరుదైన దృశ్యం: ఆదిత్యుని తాకిన కిరణాలు..

  • Published By: veegamteam ,Published On : March 10, 2019 / 03:14 AM IST
అరసవల్లిలో అరుదైన దృశ్యం: ఆదిత్యుని తాకిన కిరణాలు..

ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం (మార్చి 10,2019)న అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.   గర్భగుడిలోని స్వామివారిని ప్రభాత కిరణాలు తాకాయి. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సూర్య కిరణాలు ముందుగా స్వామి పాదాల నుంచి శిరస్సు వరకు చేరుకోవడంతో భక్తులు తన్మయత్వంలో మునిగితేలారు. మొదటి రోజు శనివారం(మార్చి 9,2019)న వాతావరణం అనుకూలించక పోవడంతో స్వామి ఆలయంలోని మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకలేదు దాంతో భక్తులు నిరాశ చెందారు. అయితే, రెండో రోజు మాత్రం ఏకంగా పది నిమిషాల పాటు స్వామివారి గర్భాలయంలో కిరణాలు మూలవిరాట్టును తాకాయి. 
 
ఈ ఆలయంలో సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయణానికి మారే సందర్భంలో కిరణస్పర్శ మూలవిరాట్టును తాకడం సంప్రదాయంగా వస్తోంది. సూర్య కిరణాలు కేవలం నాలుగైదు నిమిషాల పాటు స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్లే ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తారు. 

మన దేశంలోని సూర్యదేవాలయాలలో ఇది అత్యంత ప్రాచీనమైనది. పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కశ్యప మహర్షి ఈ దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. సాక్షాత్తు ఇంద్రుడే ఈ ఆలయం నిర్మించాడని, దీని పక్కనే ఉన్న కోనేరును ఇంద్ర పుష్కరిణి అని అంటారు.