ఆ కేసులో సన్నీ లియోన్‌కు ఊరట, అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం

ఆ కేసులో సన్నీ లియోన్‌కు ఊరట, అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం

Sunny Leone Gets Relief from Kerala HC: బాలీవుడ్ శృంగార నటి సన్నీ లియోన్ కు కేరళ హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. సన్నీని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఆమెకు ముందస్తు నోటీసులు ఇవ్వాలని సూచించింది.

సన్నీ తమను మోసం చేసిందంటూ ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఆమెపై ఫిర్యాదు చేసింది. 2019లో కొచ్చిలో జరిగిన వేలంటైన్స్ డే ఫంక్షన్ లో పాల్గొంటానని సన్నీ తమ నుంచి రూ.29 లక్షలు తీసుకుందని… కానీ, ఈవెంట్ కు ఆమె హాజరు కాలేదంటూ ఫిర్యాదులో తెలిపింది. ఈ ఫిర్యాదు ఆధారంగా సన్నీ లియోన్ పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు.

ఇటీవల ఓ టీవీ షో కోసం తిరువనంతపురం సమీపంలోని పూవర్ రిసార్ట్ కు వచ్చిన సన్నీని పోలీసులు ప్రశ్నించారు. ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఈ సందర్భంగా సన్నీ తెలిపింది. కాగా, పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయడంతో, ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించింది సన్నీ. పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు… సన్నీని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది.

ఈవెంట్ ఆర్గనైజర్ చేసిన ఆరోపణలను సన్నీ లియోన్ ఖండించింది. ప్రోగ్రాం షెడ్యూల్ సరిగా ఏర్పాటు చేయకుండా తనను రెండు సార్లు అనవసరంగా రప్పించారని, ఆ రెండు సార్లు కార్యక్రమాలు జరగలేదని తెలిపింది. తనకు రావల్సిన డబ్బు కూడా సకాలంలో చెల్లించలేదని ఆరోపించింది. ప్రస్తుతం రేయింబవళ్లు షూటింగ్ చేస్తూ, ఇండస్ట్రీకి పాత రోజులు తీసుకురావాలని చూస్తుంటే ఇలాంటి వారి మాటలు బాధ కలిగిస్తున్నాయని సన్నీ వాపోయింది. పోలీసులకు నేను వివరణ ఇచ్చాను. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆమె చెప్పింది. స్ల్పిట్స్ విల్లా కొత్త సీజన్ షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం తిరువనంతపురంలో ఉంది సన్నీ.