Supreme Court Defaulters : వారి ఆస్తులు జప్తు చేసుకోవచ్చు.. వ్యక్తిగత హామీదారులకు సుప్రీంకోర్టు షాక్

ఒక కార్పొరేట్ కంపెనీ దివాలా తీస్తే బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ బకాయిల పరిస్థితి ఏంటి? ఆ రుణాలను బ్యాంకులు వదులుకోవాల్సిందేనా? కార్పొరేట్ బకాయిదారులకు వ్యక్తిగత హామీదారులుగా ఉన్నవారిపై దివాలా చర్యల విషయంలో అనుమానాలను పటాపంచలు చేసింది సుప్రీంకోర్టు.

Supreme Court Defaulters : వారి ఆస్తులు జప్తు చేసుకోవచ్చు.. వ్యక్తిగత హామీదారులకు సుప్రీంకోర్టు షాక్

Supreme Court Defaulters

Supreme Court Allows Banks : ఒక కార్పొరేట్ కంపెనీ దివాలా తీస్తే బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ బకాయిల పరిస్థితి ఏంటి? ఆ రుణాలను బ్యాంకులు వదులుకోవాల్సిందేనా? కార్పొరేట్ బకాయిదారులకు వ్యక్తిగత హామీదారులుగా ఉన్నవారిపై దివాలా చర్యల విషయంలో అనుమానాలను పటాపంచలు చేసింది సుప్రీంకోర్టు. ఈ విషయంపై ఉన్న అనుమానాలన్నింటిని తీర్చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దేశీయ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు సుప్రీంకోర్టులో గొప్ప విజయం లభించింది. దివాలా స్మృతి(ఐబీసీ) కింద రుణాల రికవరీ విషయంలో అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోడానికి బ్యాంకులను అనుమతిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌(2019)ను సుప్రీంకోర్టు సమర్థించింది. కార్పొరేట్ సంస్థలు తీసుకున్న రుణాలపై వ్యక్తిగత హామీదారుల ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. దీంతో కొన్ని డజన్ల మందికిపైగా పారిశ్రామికవేత్తలపై వ్యక్తిగతంగా దివాలా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు అనుమతి లభించినట్లైంది.

ఐబీసీ కింద ఖాయిలా పడ్డ కంపెనీల పునరుజ్జీవానికి పరిష్కార ప్రణాళికకు అనుమతి ఇచ్చినంత మాత్రాన, వ్యక్తిగత హామీదార్లు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రద్దు కావని, అవి విడిగా కాంట్రాక్టులకు లోబడి ఉండడమే అందుకు కారణమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక స్వతంత్ర కాంట్రాక్టు ఆధారంగా ఏర్పడ్డ ఆ హామీ లిక్విడేషన్‌ లేదా దివాలా ప్రక్రియ లేదా ఆపరేషన్‌ ఆఫ్‌ లా లేదా ఇన్‌వాలంటరీ ప్రక్రియ కారణంగా బయటపడబోదని 82 పేజీల తీర్పులో ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ చట్టబద్ధమైనది, చెల్లుబాటు అయ్యేదని ధర్మాసనం తెలిపింది. రుణాలు పొందడం కోసం బ్యాంకులు, ఆర్థిక కంపెనీలకు వ్యక్తిగత హామీలు ఇచ్చిన వివిధ కంపెనీలు, వ్యక్తులు దాఖలు చేసిన 75కు పైగా పిటిషన్ల నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది.

ఈ తీర్పుతో ఏం జరుగుతుంది?
తాజా తీర్పుతో రుణ పరిష్కారం కోసం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కి వెళ్లిన భారత కంపెనీలకు చెందిన పలువురు ప్రమోటర్లపై వ్యక్తిగత దివాలా దాఖలు చేయడానికి బ్యాంకులకు అనుమతులు వచ్చినట్లయింది. ఎగవేతదార్ల వ్యక్తిగత హామీలపై చర్యలకు దిగడానికి ప్రభుత్వం నవంబర్ 2019లో ఐబీసీని సవరించడం దీనికి నేపథ్యం. గతేడాది(2020) రిలయన్స్‌ గ్రూప్‌ అనిల్‌ అంబానీ, దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్ప్‌నకు చెందిన కపిల్‌ వాద్వాన్‌, భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌కు చెందిన సంజయ్‌ సింఘాల్‌ తదితర కంపెనీలకు చెందిన ప్రమోటర్లపై దివాలా కేసులు ఫైల్‌ అయ్యాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వీరిపై చర్యలు మార్గం సుగమం అయ్యింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనిల్ అంబానీ సహా పలువురు కార్పొరేట్ల 40వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల భవితవ్యం తేలనుంది. బ్యాంకులు ఇచ్చిన రుణాలపై కంపెనీల తరపున వ్యక్తిగతంగా గ్యారంటీలు సమర్పించిన కార్పొరేట్ అధినేతలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవచ్చు.