సెంట్రల్ విస్టా శంకుస్థాపనకు సుప్రీం అనుమతి..కానీ!

  • Published By: venkaiahnaidu ,Published On : December 7, 2020 / 04:54 PM IST
సెంట్రల్ విస్టా శంకుస్థాపనకు సుప్రీం అనుమతి..కానీ!

Supreme Court :ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​ నుంచి ఇండియా గేట్​ వరకు మూడు కి.మీ మేర నిర్మించ తలపెట్టిన సెంట్రల్​ విస్టా ప్రాజెక్టుపై సోమవారం(డిసెంబర్-7,2020)సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సెంట్రల్​ విస్టా నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్​ ఏఎం ఖాన్ ​విల్కర్​ నేతృత్వంలోని ధర్మాసనం…ప్రాజెక్టు పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసింది. పెండింగ్​లో ఉన్న పిటిషన్లపై నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి నిర్మాణాలు, లేదా కూల్చివేతలు చేపట్టకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.



సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకు ప్రాజెక్టులో నిర్మాణాలు, కూల్చువేతల వంటివి చేపట్టబోమని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా ధర్మాసనానికి హామీ ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన కాగితపు వర్క్​, ప్రతిపాదిత గ్రౌండ్​ బ్రేకింగ్​ వేడుక లేదా శంకుస్థాపనకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.



కాగా, డిసెంబర్​ 10న నూతన పార్లమెంట్​ భవన నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.971 కోట్లతో చేపడుతోన్న ఈ నిర్మాణాన్ని 2022లోపు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా. కొత్త పార్లమెంట్‌ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ నిర్మిస్తోంది.



కాగా, నూతన పార్లమెంట్​ భవనం సహా ఇతర విభాగాల నిర్మాణాలు ఒకే చోట చేపట్టేందుకు గత ఏడాది సెప్టెంబర్ ​లో ఈ ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది. దేశ రాజధానిలో వివిధ మంత్రిత్వశాఖలు అద్దె రూపేణా చెల్లిస్తున్న మొత్తాలను ఆదా చేయడంతో పాటు మెరుగైన సమన్వయం కోసమే రాష్ట్రపతి భవన్​ నుంచి ఇండియా గేట్​ వరకు మూడు కి.మీ మేర సెంట్రల్​ విస్టా ప్రాజెక్టును తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు కేంద్రప్రభుత్వం చెబుతోంది. ఇదే ప్రాజెక్టులో ఉమ్మడి కేంద్ర సచివాలయాన్ని 2024 వరకు నిర్మించతలపెట్టారు.