జగన్నాథ రథ యాత్రకు సుప్రీం అనుమతి

  • Published By: venkaiahnaidu ,Published On : June 22, 2020 / 11:58 AM IST
జగన్నాథ రథ యాత్రకు సుప్రీం అనుమతి

మంగళవారం(జూన్-23,2020)నుంచి ప్రారంభం కానున్న పూరీ జగన్నాథ రథ యాత్రకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో కొన్ని షరతులతో రథ యాత్ర నిర్వహించుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది.   కాగా,ఇటీవల కరోనా వైరస్ దృష్ట్యా  పూరీ జగన్నాథ రథయాత్రకు  సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. 

కాగా,  భారత్‌లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక పూరీ జగన్నాథ రథయాత్రను ప్రజల్లేకుండా జరిపేందుకు అనుమతించాలని కేంద్రం అంతకుముందు సుప్రీంకోర్టును కోరింది. కేంద్రం వాదనకు ఒడిశా ప్రభుత్వం సైతం మద్దతుగా నిలిచింది. దీంతో దీనిపై స్పందించిన సుప్రీం.. ఈ అంశంపై లోతైన విచారణ జరిపేందుకు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.  దీనిపై చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం సోమవారం  విచారణ జరిపి పూరీ జగన్నాథ రథ యాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

అయితే  కేవలం పూరీలో మాత్రమే జగన్నాథ రథ యాత్ర నిర్వహించాలని సుప్రీంకోర్డు ఆదేశించింది. కరోనా వ్యాప్తి కారణంగా భక్తులు లేకుండానే యాత్ర నిర్వహించాలని సూచించింది.కరోనా వేళ ప్రజల ఆరోగ్యంపై రాజీపడేది లేదని స్పష్టం చేసింది సుప్రీం. పూరీలో మాత్రమే రథయాత్రకు అనుమతిస్తున్నామని.. మిగతా ప్రాంతాల్లో యాత్ర నిర్వహించకూడదని స్పష్టం చేసింది.

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఈ రథయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని, రథ యాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోర్టు ఆదేశించింది. సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా రథయాత్రను నిర్వహిస్తామని ఒడిశా ప్రభుత్వం.. న్యాయస్థానానికి నివేదించింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు రేపు సాయంత్రం పూరీ జగన్నాథ రథ యాత్ర ప్రారంభం కానుంది.

సుప్రీం తీర్పు నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పూరీ రథయాత్ర ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులు, ఆలయ ధర్మకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.

Read: మారని చైనా…యదేచ్ఛగా కుక్క మాంసం విక్రయాలు