India LockDown : లాక్‌డౌన్‌ విధింపును పరిశీలించండి.. ఆక్సిజన్ కొరతను పరిష్కరించండి : సుప్రీం

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుండటంతో.. లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు. దేశంలో రోజూ దాదాపు నాలుగు లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయని..

India LockDown : లాక్‌డౌన్‌ విధింపును పరిశీలించండి.. ఆక్సిజన్ కొరతను పరిష్కరించండి : సుప్రీం

India Lockdown

India LockDown : కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుండటంతో.. లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు. దేశంలో రోజూ దాదాపు నాలుగు లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయని, ప్రజల జీవితాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్‌ నియంత్రణకు సంబంధించి లాక్‌డౌన్ విధించే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. లాక్‌డౌన్ వల్ల పేదలపై సామాజిక, ఆర్థిక ప్రభావం ఎక్కువగా ఉంటోందని… కాబట్టి లాక్‌డౌన్ విధించాల్సి వస్తే… వారికోసం అవసరమైన ఏర్పాట్లు ముందే చేయాలని సూచించింది సుప్రీంకోర్టు.

ప్రజలు సర్థుకునేందుకు కొంత సమయం ఇచ్చి లాక్‌డౌన్‌ విధించాలని చెప్పింది. భారీగా జనం గుమిగూడే సమావేశాలు, ఇతరత్రా ఈవెంట్లపై నిషేధం విధించే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా పరిగణించాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు, భవిష్యత్ ప్రణాళికలు ప్రతీ ఒక్కటి రికార్డు చేయాలని ఆదేశించింది అత్యన్నత ధర్మాసనం.

కరోనా నియంత్రణకు జాతీయ విధానం
ఢిల్లీలో ఆక్సిజన్ కొరతను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎమర్జెన్సీ వినియోగం కోసం ఆక్సిజన్ నిల్వలు ఏర్పాటు చేసుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రాలకు కేటాయించిన ఆక్సిజన్‌‌తో పాటు రాబోయే 4 రోజుల్లో ఎమర్జెన్సీ వినియోగానికి ఆక్సిజన్ నిల్వలు ఏర్పాటు చేసుకోవాలని, అలాగే రోజువారీ ప్రాతిపదికన వాటిని పర్యవేక్షించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఆస్పత్రుల్లో అడ్మిషన్లకు సంబంధించి రెండు వారాల్లోగా జాతీయ విధానాన్ని రూపొందించాలని… రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దాన్ని పాటించాలని ఆదేశించింది. అప్పటివరకూ దేశవ్యాప్తంగా ఏ ఆస్పత్రిలోనూ స్థానికత ఆధారంగా ఏ పేషెంట్‌కు వైద్యం నిరాకరించరాదని ఆదేశించింది.

ఇప్పటికే ఉన్న ఆక్సిజన్ నిల్వలు, వ్యాక్సిన్ల ధరలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి పున:సమీక్ష జరపాలని సూచనలు చేసింది. కరోనా సమయంలో రెమ్‌డిసివిర్, టోసిలిజుమాబ్ వంటి డ్రగ్స్‌ను అధిక ధరలకు విక్రయించడం లేదా నకిలీ డ్రగ్స్ విక్రయించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్న వేళ ఇలాంటి చర్యలు వారిని మరింత దోపిడీ చేయడమేనని అభిప్రాయపడింది. సోషల్ మీడియాలో సమాచారాన్ని నియంత్రించడం లేదా ఏ ప్లాట్‌ఫామ్ ద్వారానైనా సహాయం కోరే వ్యక్తులకు వేధింపులు ఎదురైతే.. ఆ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. ఈ విషయాన్నికేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చీఫ్ సెక్రటరీలు, డీజీపీ, సీపీలకు నోటీఫై చేయాలని ఆదేశించింది.