దేశవ్యాప్తంగా కరోనా టెస్టుకు ఒకే ఫీజు…సుప్రీం కోర్టు

  • Published By: venkaiahnaidu ,Published On : June 19, 2020 / 10:25 AM IST
దేశవ్యాప్తంగా కరోనా టెస్టుకు ఒకే ఫీజు…సుప్రీం  కోర్టు

వివిధ రాష్ట్రాల్లో COVID-19 పరీక్ష ఛార్జీలలో తేడాలను గమనించిన  సుప్రీంకోర్టు  ఈ పరీక్షలకు ఉన్నత పరిమితిని నిర్ణయించాలని కేంద్రాన్ని కోరింది. కరోనా రోగుల చికిత్స, మృతదేహాల అంత్యక్రియల నిర్వహణ తీరుపై శుక్రవారం  సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. కరోనా నిర్ధరణ పరీక్షల ధర దేశమంతా ఒకేలా ఉండేలా చూడాలని దేశ అత్యున్నత న్యాయస్థానం  స్పష్టం చేసింది.

కరోనా రోగులకు  ట్రీట్మెంట్ పై  కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. సుమోటోగా తీసుకొని ఈ కేసును జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం  విచారిస్తోంది. అయితే  హాస్పిటల్స్ లో కరోనా  రోగులకు అందుతున్న ట్రీట్మెంట్  తీరు, కరోనా టెస్ట్ లపై  ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. తాజాగా కరోనా పరీక్షల ధరలపైనా కీలక వ్యాఖ్యలు చేసింది.

 కరోనా చికిత్స ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయని.. దేశమంతటా ధరల ఒకేలా ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని రాష్ట్రాలు, తక్కువ ధరకే కరోనా పరీక్షలు చేసేలా ఉత్తర్వులు తేవడాన్ని కోర్టు స్వాగతించింది.

అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో కరోనా రోగుల వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని LNJP ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడాన్ని ప్రస్తావించింది. కరోనా వార్డుల్లో సీసీ కెమెరాలను నిత్యం పర్యవేక్షించడం ద్వారా కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందుతుందని కోర్టు అభిప్రాయపడింది.

Read: కరోనా ఉన్నా అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యే