రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌ అనుమతి నిర్ణయం ఢిల్లీ పోలీసులదే

రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌ అనుమతి నిర్ణయం ఢిల్లీ పోలీసులదే

Supreme Court Key commands on farmers’ tractor parade : రిపబ్లిక్‌ డే నాడు రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ పరేడ్‌ అనుమతిపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రాక్టర్‌ పరేడ్‌కు అనుమతిచ్చే అధికారాన్ని ఢిల్లీ పోలీసులకే అప్పగించింది. ట్రాక్టర్‌ ర్యాలీకి అనుమతి ఇవ్వాలా.. వద్దా అన్నది పోలీసులే నిర్ణయించాలని చెప్పింది. దీనిపై పూర్తి స్వేచ్ఛను పోలీసులకు ఇస్తున్నట్టు తెలిపింది. దీంతో పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

గణతంత్ర దినోత్సవం నాడు భారీ ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌ ముగిసిన వెంటనే ఢిల్లీ ఔటర్ రింగ్‌ రోడ్‌పై లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ఢిల్లీలో పోలీసులు రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌కు అనుమతివ్వరాదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌కు పర్మిషన్‌ ఇవ్వవద్దని పిల్‌లో కోరారు. దీనిపై విచారించిన సుప్రీం ధర్మాసనం…. అనుమతి ఇవ్వాలా.. వద్దా అన్నది పోలీసులే నిర్ణయించాలని ఆదేశించింది. సాగు చట్టాలపై దాఖలైన పలు పిటిషన్లపైనా సుప్రీంకోర్టు విచారిస్తోంది.

ఇక రైతులతో చర్చలకు కేంద్రం మరోసారి సిద్ధమైంది. రేపు రైతు సంఘాలతో చర్చించేందుకు సిద్ధమని ప్రకటించింది. మరోసారి చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ రైతు సంఘాల నేతలను ఆహ్వానించారు. రేపు మధ్యాహ్నం ఆందోళనలు, వ్యవసాయచట్టాలపై చర్చించేందుకు రావాలని సూచించారు. దీంతో కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య పదోసారి చర్చలు జరుగనున్నాయి. మరోవైపు నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ కూడా రేపే సమావేశం కానుంది. పూసా క్యాంపస్‌లో ఈ సమావేశం ఉంటుందని కమిటీ సభ్యుడు అనిల్‌ ఘన్వత్‌ వెల్లడించారు. దీంతో రేపైనా రైతుల ఆందోళనలకు పరిష్కారం లభిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.

కేంద్ర ప్రభుత్వానికి, రైతులకు మధ్య ఇప్పటికే 9సార్లు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు తెగేసి చెబుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం… సాగు చట్టాల రద్దుతప్ప… అంశాల వారీగా సవరణలు సూచిస్తే చేస్తామని చెబుతోంది. దీంతో 9దఫాలుగా చర్చలు జరిగినా ఎలాంటి పరిష్కారం లభించలేదు. రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.