హిందూ,ముస్లిం వివాహంపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 07:34 AM IST
హిందూ,ముస్లిం వివాహంపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు

హిందూ, ముస్లిం వివాహం
సుప్రీంకోర్టు కీలక తీర్పు
భర్త ఆస్తిపై భార్యకు హక్కు లేదు
పిల్లలకు మాత్రం హక్కు
 

ఢిల్లీ :  హిందూ, ముస్లిం వివాహం (మతాంతర వివాహం)పై దేశ అత్యున్నత న్యాయం అయిన సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందూ-ముస్లిం వివాహబంధంలో భార్యకు భర్త ఆస్తిపై ఎటువంటి హక్కు ఉండదని సంచలన తీర్పునిచ్చింది. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ శాంతనగౌడర్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించగా..ఆమె భరణం (మెయిన్ టినెన్స్ ) పొందవచ్చని ఆమెకు ఆ హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. వారి పుట్టిన బిడ్డలకు మాత్రం తండ్రి ఆస్తిపై అందరిలాగే పూర్తి హక్కులు ఉంటాయని తెలిపింది. 

ఈ కీలక తీర్పు విషయంపై గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత ధర్మాసనం సమర్థించింది. కేరళకు చెందిన ఇలియాజ్ అనే వ్యక్తి ఓ హిందూ మహిళను మతాంతర వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి షంషుద్దీన్ అనే కుమారుడు ఉన్నాడు. కుమారుడు పుట్టిన కొంతకాలానికి ఇలియాజ్ మరణించాడు.

ఇదే అదనుగా భావించిన ఇలియాజ్ తల్లిదండ్రులు తల్లీ కుమారుడ్ని వదిలించుకోవాలనే ఉద్ధేశ్యంతో వారిని నిర్లక్ష్యం చేస్తువచ్చారు. ఈ క్రమంలో తండ్రి ఆస్తి కోసం వారి అవసరాల కోసం షంషుద్దీన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తన తండ్రి ఆస్తిని తమకు ఇప్పించాలని కోరారు. ఈ కేసును విచారించిన హైకోర్టు తల్లికి ఆస్తిపై ఎలాంటి హక్కు లేకపోయినా భరణం పొందవచ్చని..సంప్రదాయంగా జరిగే వివాహాల వలెనే ఇలా అరుదైన మతాంతర వివాహాల ద్వారా జన్మించిన పిల్లలకు కూడా తండ్రి ఆస్తిపై సంపూర్ణ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో ఇలియాజ్ తండ్రి తరఫు బంధువులు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఇలియాజ్ భార్య హిందువు కాబట్టి ఆస్తి దక్కదని వాదించారు. వీరి వాదనలను తిరస్కరించిన ధర్మాసనం.. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అంటే మతాంతర వివాహం విషయంలో భార్యకు భర్త ఆస్తిపై హక్కు ఉండదనీ..వారి సంతానికి మాత్రం తండ్రి ఆస్తిపై హక్కు వుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.