మొహరం ఊరేగింపుకు నో పర్మిషన్

  • Published By: venkaiahnaidu ,Published On : August 27, 2020 / 07:25 PM IST
మొహరం ఊరేగింపుకు నో పర్మిషన్

కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న వేళ దేశవ్యాప్తంగా మొహరం ప్రదర్శనలను అనుమతించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మొహరం ప్రదర్శనలకు అనుమతించాలని షియా నేత సయ్యద్‌ కల్బే జవాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. పెద్దసంఖ్యలో ప్రజల ఆరోగ్యానికి ముప్పును కలిగించేలా తాము ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది.

పిటిషన్‌ను ఉపసంహరించి అలహాబాద్‌ హైకోర్టులో అప్పీల్‌ చేయాలని పిటిషనర్‌కు సర్వోన్నత న్యాయస్ధానం సూచించింది. లక్నోలో పరిమిత సంఖ్యలో ప్రార్ధనలు నిర్వహించేందుకు అనుమతి కోసం హైకోర్టును సంప్రదించవచ్చని పేర్కొంది.

ఊరేగింపులకు అనుమతిస్తూ దేశమంతటికీ తాము సాధారణ ఉత్తర్వులను ఎలా జారీ చేస్తామని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సాధారణ ఉత్తర్వులు, ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదని, ఇది గందరగోళానికి తావివ్వడమే కాకుండా కోవిడ్‌-19 వ్యాప్తికి ఓ వర్గాన్ని టార్గెట్‌ చేసే అవకాశం ఉందని ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బొపన్న, జస్టిస్‌ వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కాగా, పూరి జగన్నాథ్‌ రథయాత్ర ఒక నిర్ధిష్ట ప్రాంతానికి సంబంధించిన అంశమని, ఇది నిర్ధిష్ట ప్రదేశం కావడంతో ప్రమాదాన్ని అంచనా వేసి తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశామని ధర్మాసనం తెలిపింది.