అనంత పద్మనాభ స్వామి ఆలయ వివాదంపై సుప్రీం తీర్పు

  • Published By: madhu ,Published On : July 13, 2020 / 11:41 AM IST
అనంత పద్మనాభ స్వామి ఆలయ వివాదంపై సుప్రీం తీర్పు

9 సంవత్సరాలుగా కొనసాగుతున్న అనంతపద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆలయ మేనేజ్ మెంట్ వివాదంలో ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పును ప్రకటించింది.

రాజకుటుంబానికి ఆలయ పాలనపై ఉన్న హక్కులను సమర్థించింది. ఈ క్రమంలోనే…ఆలయానికి సంబంధించి పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. కొత్త కమిటీ ఏర్పాటు అయ్యే వరకు ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని సుప్రీం తెలిపింది.

కేరళ రాష్ట్రంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ మేనేజ్ మెంట్ వివాదం కొనసాగుతూ వచ్చింది. ఆలయం సంపదలు, నిర్వహణ బాధ్యతలను ట్రావెన్ కోర్ రాజవంశం నుంచి స్వాధీనం చేసుకోవాలని కేరళ హైకోర్టు తీర్పు వెలువరించింది.

2011 జనవరి, 31వ తేదీన ఈ తీర్పు చెప్పింది. దీనిపై ట్రావెన్ కోర్ రాజవంశీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ…సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీం విచారణ జరిపింది. గత సంవత్సరం ఏప్రిల్ లో తీర్పును రిజర్వ్ లో ఉంచింది.
2011లో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అపార సంపదలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే.

నేలమాళిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకూ దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది. ఆలయంలోని ఆరు నేలమాళిగలలో ఇప్పటికే ఐదు నేలమాళిగలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.

అనంతరం పలు విషాద ఘటనలు జరిగాయి. నేలమాళిగలు తెరిచిన తర్వాతే ఇలా జరుగుతోందని..అందుకే ఆరో నేలమాళిగ తెరవకూడదని కొంతమంది వాదించారు. ప్రస్తుతం సుప్రీం ఇచ్చిన తీర్పుతో ఆరో నేలమాళిగ విషయంలో ట్రావెన్ కోర్ రాజవంశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Read Here>>అమితాబ్ కు కరోనా…ప్రార్థించను అంటున్న వర్మ