నరేంద్ర మోడీ కాదు సరెండర్ మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : June 21, 2020 / 12:15 PM IST
నరేంద్ర మోడీ కాదు సరెండర్ మోడీ

లడఖ్ బోర్డర్ లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోడీపై  తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.  భారత భూభాగాన్ని చైనాకి కట్టబెట్టారనీ.. ఆయన ‘‘సరెండర్’’ మోడీ  అంటూ రాహుల్  వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

గల్వాన్ లోయలో చైనా దురాక్రమణపై కేంద్రాన్ని నిలదీస్తూ వస్తున్న రాహుల్ ఇవాళ మరోసారి ట్విటర్ వేదికగా మోడీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోడీ  వాస్తవానికి సరెండర్ మోడీ ’’ అంటూ రాహుల్ ట్వీట్ లో తెలిపారు. జపాన్‌ టైమ్స్ రాసిన ఓ కథనాన్ని సైతం ఆయన తన పోస్టుకు జత చేశారు. చైనా బలగాలు భారత భూభాగంలోకి రాలేదంటూ ప్రధాని మోడీ  పేర్కొన్న మరుసటి రోజే రాహుల్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. 

ఈ నెల 15న తూర్పు లడఖ్ లోని  గాల్వాన్ లోయలో చైనా పీఎల్ఏ బలగాలతో జరిగిన తీవ్ర ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గల్వాన్​ వ్యాలీలో సోమవారం నాటి  ఘటనతో వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి ‘రూల్స్​ ఆఫ్​ ఎంగేజ్​మెంట్​’లో భారత్  కీలక మార్పులు చేసింది. దీంతో  అసాధారణ పరిస్థితుల్లో ఆయుధాలను ఉపయోగించే విధంగా సైనికులకు పూర్తి స్వేచ్ఛ లభించింది. .

మరోవైపు, తూర్పు లడఖ్ లో  ప్రస్తుతం నెలకున్న పరిస్థితులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారత త్రిదళాధిపతి(సీడీఎస్) బిపిన్‌ రావత్‌తో పాటు త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైనా దాడులను తిప్పికొట్టాలని, వారి ప్రతి కదలికలపై నిఘా ఉంచాలని రాజ్‌నాథ్ సింగ్  ఆదేశించారు. చైనా సరిహద్దుల్లో ఆర్మీకి ఫ్రీహ్యాండ్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

Read: బోర్డర్​లో కొత్త రూల్స్…తుపాకులు వాడేందుకు జవాన్లకు పూర్తి స్వేచ్ఛ