వేదాల సాక్షిగా సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేసిన “సురినమే” అధ్యక్షుడు…గర్వకారణమన్న మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : July 26, 2020 / 09:31 PM IST
వేదాల సాక్షిగా సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేసిన “సురినమే” అధ్యక్షుడు…గర్వకారణమన్న మోడీ

దక్షిణా అమెరికాలోని సురినమే దేశంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన చంద్రికాప్రసాద్ సంతోకీ…వేదాలసాక్షిగా సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ నెల 16న జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పురోహితుడు చెబుతున్న సంస్కృత శ్లోకాలను చంద్రికా ప్రసాద్ పలుకుతూ ప్రమాణం చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. చంద్రికా ప్రసాద్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కావడం, అందులోనూ హిందువు కావడం వల్లనే ఈ విధంగా హిందూ సంప్రదాయంలో ప్రమాణ స్వీకారం చేసినట్లు తెలుస్తోంది.


సురినమే నూతన అధ్యక్షుడు చంద్రికాప్రసాద్ సంతోకీకి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తన దేశానికి సేవ చేస్తున్నందుకు ఆయనకు భారతీయుల తరపున మోడీ శుభాకాంక్షలు తెలిపారు. సురినామే నూతన అధ్యక్షుడు చంద్రికా పరాసద్ సంతోకి వేదాలను స్వీకరించి ప్రమాణం చేయడం, వేద శ్లోకాలతో ప్రారంభించడం భారతీయులందరికీ గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం(జులై-26,2020) తన ‘మన్ కి బాత్’ రేడియో ప్రసంగంలో చెప్పారు. చంద్రికాప్రసాద్ సంతోకీ తన ప్రమాణాన్నీ ఓం శాంతి, శాంతి, శాంతితో ముగించిన విషయాన్ని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

వంద సంవత్సరాల క్రితం, భారతదేశం నుండి ప్రజలు అక్కడికి(సురినమే) వెళ్లి దానిని తమ నివాసంగా చేసుకున్నారు. నేడు, నాల్గవ లేదా ఐదవ తరం ఉంది. నేడు సురినామ్‌లో నాల్గవ వంతు మంది భారతీయ సంతతికి చెందినవారు.అక్కడ ఉన్న సాధారణ భాషలలో ఒకటి ‘సర్నామి’ భోజ్‌పురి మాండలికం. భారతీయులైన మేము ఈ సాంస్కృతిక సంబంధాల గురించి చాలా గర్వంగా భావిస్తున్నాము అని మోడీ అన్నారు.