తబ్లిగీ జమాత్ అంటే ఏంటి….దేశాన్ని హడలెత్తిస్తున్న ఢిల్లీ నిజాముద్దీన్ ఈవెంట్

  • Published By: venkaiahnaidu ,Published On : March 31, 2020 / 11:12 AM IST
తబ్లిగీ జమాత్ అంటే ఏంటి….దేశాన్ని హడలెత్తిస్తున్న ఢిల్లీ నిజాముద్దీన్ ఈవెంట్

ఓ వైపు విదేశాల నుంచి వచ్చిన వారిలో నెమ్మదిగా కరోనా లక్షణాలు బయటపడి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతున్న సమయంలో ఇప్పుడు ఢిల్లీలోని మర్కజ్ మసీదులో ఈనెల 13-15 మ‌ధ్య‌న ఢిల్లీలో జ‌రిగిన త‌బ్లిగీ జ‌మాత్ స‌మావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ముస్లింలు హాజ‌ర‌వడం, దాంట్లో ఇప్ప‌టికే ఆరు మంది క‌రోనా వైర‌స్‌తో మృతిచెందడం,ఇవాళ మరో 24మందికి పాజిటివ్ అని తేలడం దేశవ్యాప్తంగా సంచనలం సృష్టిస్తోంది. 

అయితే తబ్లిగీ, జ‌మాత్‌, మ‌ర్క‌జ్ అనేవి మూడు భిన్న ప‌దాలు. త‌బ్లిగీ అంటే అల్లా సందేశాన్ని ప్ర‌చారం చేసేవారు. జ‌మాత్ అంటే స‌మూహం. మ‌ర్క‌జ్ అంటే మీటింగ్ కోసం ఏర్పాటైన స్థ‌లం. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్న అంశాలు ఇవే. కొన్ని రోజుల క్రితం నిజాముద్దీన్‌లో ఇస్లాం మ‌త‌స్తులు భారీ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. అదే త‌బ్లిగీ జ‌మాత్‌. ముస్లింలు దేవుడిగా భావించే అల్లా ఇచ్చిన సందేశాల‌ను ప్ర‌చారం చేయ‌డం వీళ్ల క‌ర్త‌వ్యం. ఇదో ధార్మిక ప్ర‌చారం. ఈ వ్య‌వ‌స్థ‌తో సంబంధం ఉన్న‌వాళ్లు సాంప్ర‌దాయ ఇస్లాం మ‌తాన్ని పాటిస్తూ, ఆ విష‌యాల‌ను వీళ్లు ప్ర‌చారం చేస్తుంటారు. 

త‌బ్లిగీ జ‌మాత్ మొద‌లు ఎప్పుడంటే
1927లో త‌బ్లిగీ జ‌మాత్ ఆందోళ‌న ప్రారంభ‌మైంది. హ‌ర్యానాలోని నుహూ జిల్లా నుంచి మౌలానా ఇలియాస్ కంద‌ల్వి ఈ ఉద్య‌మాన్ని మొదలుపెట్టారు. ముస్లింలు త‌మ ధ‌ర్మాన్ని కాపాడుకునేందుకు త‌బ్లిగి జ‌మాత్ ఉద్య‌మాన్ని ప్రారంభించారు. ఇస్లాంను ప్ర‌చారం చేయ‌డం, ఆ మ‌తానికి సంబంధించిన అంశాల‌ను తెలియ‌జేయ‌డం మొద‌లుపెట్టారు. మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల కాలంలో.. చాలా మంది ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఆ త‌ర్వాత వాళ్లంతా మ‌ళ్లీ హిందూ మ‌తాన్ని స్వీక‌రించ‌డం మొద‌లుపెట్టారు. బ్రిటీషు పాల‌న స‌మ‌యంలో ఆర్య స‌మాజం మతం మారిన వారిని శుద్దీక‌రించి హిందువులుగా స్వీక‌రించ‌డం ప్రారంభించింది. ఈ స‌మ‌యంలోనే త‌మ మ‌త ప్రాశ‌స్త్యాన్ని కాపాడుకునేందుకు మౌలానా ఇలియాస్ కంద‌ల్వి ఇస్లాం మ‌త ప్ర‌చారం మొద‌లుపెట్టారు.

ప్ర‌స్తుతం త‌బ్లిగీ జ‌మాత్ శాఖ‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 213 దేశాల్లో ఉన్నాయి. తబ్లిగీ జ‌మాత్ ముఖ్య కార్యాల‌యంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఉంది. సుమారు 15 కోట్ల మంది ఈ సంస్థ‌లో స‌భ్యులుగా ఉన్నారు. 20వ శ‌తాబ్ధంలో ప్రపంచ‌వ్యాప్తంగా త‌బ్లిగీ జ‌మాత్ భారీ ఇస్లామిక్ ఉద్య‌మాన్ని చేప‌ట్టింది.