తాజ్‌మహల్‌ దగ్గర కలకలం, భారీ భద్రత ఏర్పాటు

తాజ్‌మహల్‌ దగ్గర కలకలం, భారీ భద్రత ఏర్పాటు

Taj Mahal temporarily shut: ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. తాజ్ మహల్ లో బాంబులు పెట్టామంటూ దుండగులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఈ విషయాన్ని తమ దృష్టికి తేవడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. తాజ్ మహల్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సందర్శకులను తాజ్ మహల్ నుంచి ఖాళీ చేయించారు. తాజ్ మహల్ ను తాత్కాలికంగా మూసేశారు. బాంబు, డాగ్ స్వ్కాడ్ తో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తాజ్ మహల్ దగ్గర భారీగా భద్రత ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న షాపులను కూడా మూయించారు.

ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? ఫేక్ కాలా? అనేది తేలాల్సి ఉంది. ఈ దిశగా పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో చాలాతక్కువ మంది సందర్శకులను మాత్రమే లోనికి అనుమిస్తున్నారు. బాగా తనిఖీ చేసిన తర్వాత సందర్శకులను లోనికి పంపిస్తారు. చారిత్రక కట్టడమైన తాజ్ మహల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది.

యూపీ పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 112కి ఫోన్ కాల్ వచ్చింది. తాజ్ మహల్ లో పేలుడు పదార్దాలు పెట్టామని, ఏ క్షణమైనా అవి పేలొచ్చని దుండగుడు ఫోన్ లో చెప్పాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది తాజ్ మహల్ కట్టడం పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. అయితే, ఇది ఫేక్ కాల్ అయి ఉండొచ్చనే అనుమానాలూ లేకపోలేదు. అయినప్పట్టికి పోలీసులు ముందస్తు జాగ్రత్తగా తాజ్ మహల్ లో తనిఖీలు చేపట్టారు.