తాజ్‌మహల్‌ పేరు మార్పు ?

తాజ్‌మహల్‌ పేరు మార్పు ?

Agra

tajmahal : బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్‌లోని అనేక నగరాల పేర్లను మార్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్… తాజాగా మరో పేరును మార్చేందుకు రంగం సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ఆగ్రాలో పేరొందిన తాజ్ మహల్ పేరును మార్చే అవకాశం ఉందని ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ పేర్కొనడం చర్చనీయాంశమైంది. తాజ్ మహల్ పేరును రామ్‌మహల్‌ లేదా కృష్ణమహల్‌గా మారనుందని, యోగి ఆదిత్యనాథ్‌ రాజ్యంలో ఇది జరిగితీరుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగుతోంది.

అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గా, ముఘల్‌సరాయ్‌‌ను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్‌ నగర్‌గా మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా తాజ్ మహల్ పేరును మార్చే ఛాన్స్ ఉందని వెల్లడించడం హాట్ టాపిక్ అయ్యింది. సురేంద్ర సింగ్ బైరియా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ..పై విధంగా వ్యాఖ్యలు చేశారు. తాజ్‌మహల్‌ ఒకప్పుడు శివాలయం అని, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తాజ్‌మహల్‌ పేరును త్వరలో రామ్‌మహల్‌గా లేదా కృష్ణమహల్‌గా మార్చుతుందన్నారు. సీఎం యోగి శివాజీతో పోల్చారు. సమర్ గురువు రామ్‌దాస్ శివాజీని భారతదేశానికి ఇచ్చినట్లుగానే, గోరఖ్‌ నాథ్‌ బాబా యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తరప్రదేశ్‌కు ఇచ్చారని వ్యాఖ్యానించారు. దీనిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.