JP Nadda : రాజ్యాంగ విలువల ఉల్లంఘనే,మహారాష్ట్రలో తాలిబన్ తరహా పాలన..కేంద్రమంత్రి అరెస్ట్ పై బీజేపీ చీఫ్

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కేంద్రమంత్రి నారాయణ్ రాణె ని ఇవాళ మధ్యాహ్నాం రత్నగిరిలో పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు

JP Nadda : రాజ్యాంగ విలువల ఉల్లంఘనే,మహారాష్ట్రలో  తాలిబన్ తరహా పాలన..కేంద్రమంత్రి అరెస్ట్ పై బీజేపీ చీఫ్

Nadda

JP Nadda మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కేంద్రమంత్రి నారాయణ్ రాణె ని ఇవాళ మధ్యాహ్నాం రత్నగిరిలో పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను అరెస్టు చేయడం రాజ్యాంగ విలువలను ఉల్లంఘించడం. ఇటువంటి చర్యలతో తమ పార్టీ భయపడదన్నారు. జన్-ఆశీర్వాద యాత్రలో బీజేపీకి లభిస్తున్న అపారమైన మద్దతుతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతుందని..తాము ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతూనే ఉంటామని..తమ యాత్ర కొనసాగుతుందని నడ్డా సృష్టం చేశారు.

ఇక,కేంద్రమంత్రి అరెస్ట్ పై స్పందించిన మహారాష్ట్ర మాజీ సీఎం,బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్…మహారాష్ట్రలో తాలిబన్ తరహా పాలన నడుస్తోందన్నారు. ఉద్దవ్ ఠాక్రేపై రాణె చేసిన వ్యాఖ్యలను బీజేపీ సమర్థించడంలేదని..అయితే ఆయనకు పార్టీ 100శాతం మద్దతుగా నిలబడుతుందన్నారు. కక్షపూరిత రాజీకాయాల కోసం ఓ వస్తువులాగా మహారాష్ట్ర పోలీసులు వాడబడుతున్నారని ఫడ్నవీస్ ఆరోపించారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలని..తాలిబన్ తరహా పాలన కాదని ఫడ్నవీస్ తెలిపారు.

అసలేం జరిగింది
సోమవారం రాయ్‌గ‌ఢ్ జిల్లాలో కేంద్రమంత్రి నారాయ‌ణ్ రాణె జ‌న్ ఆశీర్వాద్ యాత్ర నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేంద్రమంత్రి రాణె మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం ఏ ఏడాదిలో వ‌చ్చిందో ముఖ్య‌మంత్రి ఉద్దవ్ ఠాక్రేకి తెలియ‌క‌పోవ‌డం సిగ్గు చేటు. ఉద్దవ్ ఠాక్రే తన ఆసగ్టు-15 ప్ర‌సంగం సంద‌ర్భంగా ఇది ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవమో క‌నుక్కొని మ‌రీ చెప్పారు. ఒక‌వేళ నేను(రాణె) అక్క‌డే ఉండి ఉంటే.. ఆయ‌న‌(ఉద్దవ్ ఠాక్రే)ని లాగిపెట్టి కొట్టేవాడిని అని అన్నారు. అయితే రాణె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

రాణే వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన కార్యకర్తలు,నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ రోజు ఉదయం ముంబైలోని రాణె ఇంటి వద్దకు చేరుకున్న శివసేన సభ్యులు జెండాలు పట్టుకుని రాణెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు గ్రూపులు రాళ్లు కూడా విసురుకున్నారు. ఇక,నాసిక్‌లోని బీజేపీ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు రాళ్లురువ్వారు. శివసేన కార్యకర్తల ఫిర్యాదుతో రాణెపై.. పూణెలో ఒక ఎఫ్ఐఆర్,నాసిక్ లో ఒక ఎఫ్ఐఆర్,రాయగఢ్ జిల్లాలోని మహద్ ఏరియాలో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.

READ :Union Minister Arrested :సీఎం ఉద్ధవ్ పై అనుచిత వ్యాఖ్యలు..కేంద్రమంత్రి అరెస్ట్