త‌మిళ‌నాడు ఎన్నికలు…అక్టోబర్-7న సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న AIADMK

  • Published By: venkaiahnaidu ,Published On : September 28, 2020 / 09:50 PM IST
త‌మిళ‌నాడు ఎన్నికలు…అక్టోబర్-7న సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న AIADMK

త‌మిళ‌నాడు అధికార పార్టీ అయిన అన్నా డీఎంకే(AIADMK)లో వ‌ర్గ‌పోరు మొద‌లైంది. 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వం విష‌య‌మై సీఎం ప‌ళ‌నిస్వామి, డిప్యూటీ సీఎం ప‌న్నీర్ సెల్వం మ‌ధ్య వివాదం రాజుకుంది. వ‌చ్చే ఏడాది అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో.. ఆ విష‌య‌మై చ‌ర్చించేందుకు సోమ‌వారం చెన్నైలోని పార్టీ హెడ్ క్వార్టర్ లో అన్నాడీఎంకే కార్య‌వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది.


అక్టోబ‌ర్ 7న సీఎం అభ్య‌ర్థిని ఖరారు చేయాల‌ని ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు. అంత‌వ‌ర‌కు బాగానే కొన‌సాగిన కార్య‌వ‌ర్గ భేటీ సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌నే విష‌యంలో చ‌ర్చ మొద‌ల‌య్యే స‌రికి ర‌సాబాస‌గా మారింది. సీఎం ప‌ళ‌నిస్వామి త‌న‌నే సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాల‌ని కోర‌గా.. త‌న‌నే సీఎం క్యాండిడేట్‌గా ఖ‌రారు చేయాల‌ని ప‌న్నీర్ సెల్వం ప‌ట్టుబ‌ట్టారు.


దీంతో పార్టీ కార్య‌వ‌ర్గం రెండు గ్రూపులుగా విడిపోయి పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో దాదాపు 5గంటలపాటు జరిగిన కార్య‌వ‌ర్గ స‌మావేశంలో నిర్ణ‌యించిన‌ట్టుగానే అక్టోబ‌ర్- 7న సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తారా లేదా అనేది ఇప్పుడు స‌స్పెన్స్‌గా మారింది.