Stalin : సరికొత్త రాజకీయాలకు తెరలేపిన స్టాలిన్..కోవిడ్ సలహా కమిటీలో అన్నాడీఎంకే నేత

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సరికొత్త రాజకీయాలకు తెరలేపారు.

Stalin : సరికొత్త రాజకీయాలకు తెరలేపిన స్టాలిన్..కోవిడ్ సలహా కమిటీలో అన్నాడీఎంకే నేత

Stalin

Stalin తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సరికొత్త రాజకీయాలకు తెరలేపారు. కొవిడ్ పై పోరులో భాగంగా ఏర్పాటు చేసిన సలహా కమిటీలో అన్నాడీఎంకే నేత, రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్ కు చోటు కల్పించారు. ఈ నిర్ణయంతో స్టాలిన్.. ప్రతీకార రాజకీయాలను దూరంగా పెడుతున్నాననే సంకేతాలనిచ్చినట్లనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనాపై పోరులో భాగంగా తమిళనాడు ప్రభుత్వం.. శాసనసభ ప్రాతినిధ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలతో ఓ సలహా ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. మే-13న సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీ తీర్మానం మేరకు ఈ కమిటీలో సభ్యులను ఖరారు చేశారు. 13 మందితో కూడిన ఈ ప్యానెల్ లో అన్నాడీఎంకే నేత, రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి ఎంఆర్ విజయ భాస్కర్ ఓ సభ్యుడిగా ఉండటం విశేషం.

ఇక, సీఎం స్టాలిన్ ఈ సలహా కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో డీఎంకే నుంచి డా.ఎన్ ఎళిలన్ సహా పీఎంకే, కాంగ్రెస్, ఎండీఎంకే, బీజేపీ, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఎంఎంకే, కేఎండీకే, టీవీకే, పురట్చి భారతం పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అవసరం ఆధారంగా సలహా కమిటీ భేటీ అవుతుందని ప్రభుత్వం తెలిపింది.