తమిళ తంబి మద్దతు ఎవరికి ? ఎవరిది అధికారం

తమిళ తంబి మద్దతు ఎవరికి ? ఎవరిది అధికారం

Tamil Nadu : తమిళ తంబి మద్దతు ఎవరికీ… పదేళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన డీఎంకే గెలుస్తుందా… బీజేపీ అండతో అన్నాడీఎంకే అధికారం నిలబెట్టుకుంటుందా… జయలలిత నిచ్చెలి శశికళ ప్రభావం ఏ మేరకు ఉంటుంది… స్టార్‌ హీరో కమల్‌హాసన్‌ ఏ మేరకు ప్రభావం చూపించనున్నారు….. అసలు తమిళ ఓటర్‌ మనోగతం ఏమిటీ ? పశ్చిమబెంగాల్‌ తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తిని రేపుతున్న రాష్ట్రం తమిళనాడు. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి తమిళ రాజకీయం ఉండబోతోంది. దశాబ్ధాల పాటు తమిళ రాజకీయాలను శాసించిన ప్రత్యర్థులు కరుణానిధి, జయలలిత లేకుండా జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. గతంలో కరుణానిధి, జయలలిత ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వచ్చేవారు. కానీ 2016లో సీన్‌ మారింది. జయలలిత అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ రెండోసారి విజయం సాధించారు. ఆ తర్వాత కొంతకాలానికే అనారోగ్యంతో కన్నుమూశారు. డీఎంకే చీఫ్‌ కరుణానిధి కూడా అనారోగ్యంతో వెళ్లిపోయారు.

Tamil

234 సీట్లు : –

234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని అధికార అన్నాడీఎంకే, బీజేపీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చాయి. అయితే, బీజేపీ – అన్నాడీఎంకేల మధ్య సీఎం అభ్యర్థిత్వం చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఎన్‌డీఏ సీఎం అభ్యర్ధి విషయంలో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. కూటమి ఉమ్మడి సీఎం అభ్యర్థిని తామే నిర్ణయిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ మళ్లీ ప్రకటించడంతో కలకలం రేగుతోంది. గతవారం ఆయన ఇలాంటి ప్రకటన చేయడంతో మీ దారి మీరు చూసుకోండని అన్నాడీఎంకే కౌంటర్‌ ఇచ్చింది. దీంతో ఆయన తన ప్రకటనపై వెనక్కు తగ్గారు. కానీ, తాజాగా మధురై విమానాశ్రయం వద్ద మళ్లీ ఆ ప్రకటనే చేశారు. మురుగన్‌ ఇదే విధంగా వ్యాఖ్యానించడంతో అన్నాడీఎంకే నేతలు, సీనియర్‌ మంత్రులంతా ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి పళనిస్వామి పేరును నాయకులంతా ఏకగ్రీవంగా ప్రకటించారు. అన్నాడీఎంకే నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో మురుగన్ తన ప్రకటనను సవరించుకున్నారు.

tamil Nadu sasikala

శశికళ : –

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా ఆమె నిచ్చెలి శశికళ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని… ఇందుకోసం విభేదాలు పక్కన పెట్టాలంటూ పిలుపునిచ్చారు. అందరి ఉమ్మడి శత్రువు డీఎంకేను ఓడించేందుకు అంతా చేతులు కలుపుదాం అని అన్నాడీఎంకే నేతలకు పిలుపునిచ్చారు. వందేళ్ల వరకు తమిళనాడులో అన్నాడీఎంకే అధికారంలో ఉండాలనేది జయలలిత ఆకాంక్ష అని శశికళ గుర్తు చేశారు. అందుకోసం ప్రతి ఒక్క అన్నాడీఎంకే కార్యకర్త కృషి చేయాలని… విభేదాలు పక్కన పెట్టాలని సూచించారు. అమ్మ అభిమానులు అంతా చేతులు కలిపి పార్టీ విజయానికి కృషి చేయాలని… రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి శత్రువును ఓడించేలా కష్టపడాలన్నారు. ఇందుకోసం త్వరలోనే పార్టీ నేతలు, కార్యకర్తలను స్వయంగా కలుస్తానంటూ శశికళ వ్యాఖ్యానించారు. శశికళ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. దీనిపై అన్నాడీఎంకే నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి రేపుతోంది.

dmk stalin

డీఎంకే స్టాలిన్ : –

అటు పదేళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన డీఎంకే కూడా ఈసారి విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. పార్టీ నేత స్టాలిన్‌ ఇప్పటికే పలుమార్లు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. బీజేపీ అగ్రనేతలపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఆయన కుటుంబంలోనే విభేదాలు మరోసారి తలనొప్పిగా మారనున్నాయి. డీఎంకే బహిష్కృత నేత, స్టాలిన్ సోదరుడు అళగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని వ్యాఖ్యానించారు. మధురైలో తన మద్దతుదారులు, అనుచరులతో సమావేశమైన అళగిరి.. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలోనే ప్రకటన చేస్తానని తెలిపారు. తాను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, దానికి సిద్ధంగా ఉండాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో అళగిరిని డీఎంకే నుంచి బహిష్కరించారు. అయితే, అన్నదమ్ముల మధ్య రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగానే అళగిరిని తప్పించారన్నది బహిరంగ రహస్యం. అళగిరి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Tamil Nadu election

తమిళ ఓటర్ ఎటువైపు : –

ప్రస్తుత పరిస్థితుల్లో తమిళ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. సీనియర్లు కరుణానిధి, జయలలిత మృతి చెందిన తర్వాత ఆ పార్టీలకు నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీల్లో చీలికలు కూడా వచ్చాయి. అటు జాతీయ పార్టీలు కూడా తమ ప్రాభవాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ తంబి… ఎవరికి ఓటు వేస్తాడో… ఎవరికి అధికారం కట్టబెడతాడో చూడాలి మరి.