భారత్ పొమ్మంది..జపాన్ రమ్మంది : ఎకో ఫ్రెండ్లీ ఇంజిన్ తయారుచేసిన తమిళ ఇంజినీర్

  • Published By: venkaiahnaidu ,Published On : May 12, 2019 / 07:39 AM IST
భారత్ పొమ్మంది..జపాన్ రమ్మంది : ఎకో ఫ్రెండ్లీ ఇంజిన్ తయారుచేసిన తమిళ ఇంజినీర్

తమిళనాడులోని కోయంబత్తూర్ కి చెందిన మెకానికల్ ఇంజినీర్ కుమారస్వామి పర్యావరణహిత ఇంజిన్‌ ను తయారు చేశారు. బ్యాటరీ లేదా విద్యుత్‌ తో నడిచే ఇంజిన్ కాదిది. డిస్టిల్ వాటర్‌ను ఇంధనంగా తీసుకొని పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఆక్సీజన్ వాయువును గాల్లోకి విడుదల చేయడం దీని ప్రత్యేకత. ఈ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడానికి 10ఏండ్లు పట్టిందని కుమారస్వామి తెలిపారు. ప్రపంచంలోనే ఇలాంటి యంత్రాన్ని తయారు చేయడం ఇదే తొలిసారి. ఈ ఇంజిన్ హైడ్రోజన్‌ ను ఇంధనంగా తీసుకొని ఆక్సీజన్‌ ను బయటకి విడుదల చేస్తుంది. 

భారత్‌ లో ఈ ఇంజిన్‌ను విడుదల చేయాలనేది తన కోరికని, కానీ దీని గురించి వివరించేందుకు ఎన్నో సంస్థ‌లు, కంపెనీల చుట్టూ తిరిగినప్పటికీ ఎవరూ ఆసక్తి చూపించలేదని కుమారస్వామి తెలిపారు. చివరికి జపాన్ ప్రభుత్వాన్ని సంప్రదించి  ప్రాజెక్టు వివరాలను వారికి వివరించానని, దానికి వారు ఆమోదం తెలిపారని ఆయన తెలిపారు. మరికొన్ని రోజుల్లో ఈ ఇంజిన్ జపాన్‌లో అందరికీ పరిచయం కాబోతోందని కుమారస్వామి చెప్పారు.త్వరలో భారత్ లో కూడా ఈ ఇంజిన్ అందుబాటులోకి వస్తుందని కుమారస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ పర్యావరణహిత వాహనాల వినియోగానికి పెద్దపీట వేస్తున్నాయి. ఆ దిశగా భారత్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇచ్చి కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను క్రమక్రమంగా తగ్గించేలా చర్యలు తీసుకుంటోంది.