పుదుచ్చేరి గవర్నర్‌గా తమిళిసై ప్రమాణస్వీకారం, ఇదే తొలిసారి

పుదుచ్చేరి గవర్నర్‌గా తమిళిసై ప్రమాణస్వీకారం, ఇదే తొలిసారి

tamilisai soundararajan sworn as puducherry lg: కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌ రాజన్‌ గురువారం(ఫిబ్రవరి 18,2021) ప్రమాణస్వీకారం చేశారు. పుదుచ్చేరిలోని రాజ్‌నివాస్‌లో ఎల్జీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎల్జీగా కొనసాగిన కిరణ్‌ బేడీని రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో తెలంగాణ గవర్నర్‌ అయిన తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం నారాయణసామి, ఇతర మంత్రులు హాజరయ్యారు. కిరణ్‌ బేడీ 2016 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పని చేశారు. పుదుచ్చేరిలో కిరణ్‌ బేడీ సహా నలుగురు మహిళలు లెఫ్టినెంట్‌ గవర్నర్లుగా పని చేశారు. తమిళం మాట్లాడే వ్యక్తిని గవర్నర్‌గా నియమించడం ఇదే తొలిసారి.

పుదుచ్చేరి గవర్నర్‌గా నియమితులు కావడం ఆనందంగా ఉందన్నారు తమిళిసై. రెండేళ్లుగా తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన అనుభవంతో పుదుచ్చేరి రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తానని ఆమె చెప్పారు.

పుదుచ్చేరిలోని అధికార కాంగ్రెస్‌కు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీకి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో సీఎం నారాయణసామి ఫిబ్రవరి 10న రాష్ట్రపతిని కలిశారు. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ను రీకాల్‌ చేయాలని విన్నవించారు. దీంతో లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా కిరణ్‌ బేడీని తొలగించి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పతనావస్థలోకి జారడం కంటే, అందుకు కారకురాలైన కిరణ్‌బేడీని కేంద్రప్రభుత్వం హఠాత్తుగా పదవి నుంచి తప్పించడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నారాయణసామి ప్రభుత్వం మైనారిటీలో పడిన వార్తతో పాటే లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు కేంద్రప్రభుత్వం ఉద్వాసన చెప్పిందన్నదీ వెలుగుచూసింది. కరోనా వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని అధికారులతో సమీక్షిస్తుండగా ఉద్యోగం పోయిన విషయం కిరణ్‌బేడీకి చేరిందట.

మోదీ ప్రభుత్వం కనీస మర్యాదకు కూడా ఆమెను రాజీనామా చేయమని అడగలేదు. తక్షణ తొలగింపుతోనే రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని అధినాయకులు అనుకొని ఉంటారు. బేడీ గోబ్యాక్‌ అంటూ నెలన్నరగా నారాయణసామి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని సవ్యంగా నడవనివ్వకుండా ‘రాజ్‌నివాస్‌’ రాజకీయం చేస్తున్నదంటూ ముఖ్యమంత్రి యుద్ధం చేస్తున్నారు. కిరణ్‌బేడీని సాగనంపాలన్న ఆయన కోరిక ఎట్టకేలకు తీరింది. కానీ, రేపోమాపో తానే నిష్క్రమించవలసిన దశలో అది నెరవేరింది.

ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి, బీజేపీ పక్షాన చేరడం వెనుక కిరణ్‌బేడీ ప్రత్యక్ష హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె ప్రవేశంతో పుదుచ్చేరి రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఐదేళ్ళ క్రితం కొద్దినెలల తేడాలో పదవీబాధ్యతలు చేపట్టిన నారాయణసామి, కిరణ్‌బేడీల మధ్య యుద్ధం అనతికాలంలోనే పతాకస్థాయికి చేరుకుంది. కిరణ్‌బేడీ స్వభావం, వ్యవహారశైలి తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టడానికి ఆమె నిర్భీతి, నిక్కచ్చితనం, దూకుడు ఉపకరించాయి. ఓ గవర్నర్‌లా కాక, తీహార్‌ జైలుని కాపలాకాసిన పోలీసు అధికారిలాగానే ఆమె వ్యవహరించానే వాదనలు ఉన్నాయి.