ఇంతకీ 80C వాడాలా? వద్దా? : ఆదాయ పన్నులో రెండు విధానాలు.. పన్నుదారుల్లో గందరగోళం!

  • Published By: sreehari ,Published On : February 1, 2020 / 11:50 AM IST
ఇంతకీ 80C వాడాలా? వద్దా? : ఆదాయ పన్నులో రెండు విధానాలు.. పన్నుదారుల్లో గందరగోళం!

ఆదాయ పన్ను శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్-2020-21 సందర్భంగా ఆదాయ పన్ను శ్లాబులపై కీలక నిర్ణయం తీసుకుంది. వేర్వేరు ఆదాయ వర్గాలకు ఆదాయపు పన్ను తగ్గించింది. మధ్యతరగతి వారి వ్యక్తిగత ఆదాయ పన్నుదారులకు భారీ ఊరట కల్పించామంటోంది ప్రభుత్వం.

వ్యక్తిగతంగా పన్నులు చెల్లించే విధానం మరింత సరళతరం చేసినట్టు చెబుతోంది. వేతనజీవులకు ఉపశమనం కలిగిందంటోంది. ఇంతకీ కట్టాల్సిన పన్ను తగ్గిందని ఉపశమనమా? లేదా పన్ను శ్లాబుల్లో మార్పులు చేసినందుకు ఉపశమనా? అనేది పన్నుదారుల్లో గందరగోళం నెలకొంది. 

మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన ఈ కొత్త పన్ను విధానంతో పన్నుదారులను అయోమయానికి గురిచేస్తోంది. ఇదివరకే పాత పన్ను విధానం అమల్లో ఉంది. ఇప్పుడు దీనికి తోడుగా కొత్త పన్ను విధానం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న పన్ను విధానంతో పాటు కొత్త విధానం కూడా అమలులో ఉంటుందని చెబుతోంది. పైగా.. పన్ను చెల్లింపుదారులు ఈ రెండు విధానాల్లో ఏదైనా ఒక విధానాన్ని ఎంచుకోవచ్చు.. ఇది ఆప్షనల్ అంటూ ఓ మెలిక పెట్టింది.

కొత్త పన్ను విధానం ఎంచుకుంటే ఎలాంటి మినహాయింపులు వర్తించవు అంటూ చివరిలో షాక్ ఇచ్చింది. కొత్త విధానం ద్వారా వచ్చే అసలు ఆదాయం ఎంతో మొత్తం వెల్లడించి అంతే శాతం పన్ను చెల్లించాలంటోంది. పాత పన్ను విధానంలో మాత్రం ఎప్పటిలానే మినహాయింపులు పొందవచ్చు అంటూ వెన్నపూసి వాతపెట్టినట్టు చందంగా చెబుతోంది. 

ఇంతకీ ఈ కొత్త ఆదాయ పన్ను విధానం ఎంచుకునే ముందు.. పన్ను మినహాయింపులు పొందాలా? లేదా అన్నది వేతన జీవుల నిర్ణయంపై ఆదారపడి ఉంటుంది. ఒకవేళ పాత విధానానికి బదులుగా కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకుంటే మాత్రం 80C కింద వచ్చే పన్ను మినహాయింపులు ఏ ఒక్కటి వర్తించవు.

కొత్త పన్ను విధానం ప్రకటనతో పన్నుదారుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఎంత ఆదాయం వస్తే పన్ను మినహాయింపులు ఉంటాయి. పాత పన్ను విధానం ఎంచుకుంటే కొత్త ప్రయోజనాలు ఏమి వర్తించవు.. ఏమి వర్తిస్తాయో అర్థంకాక అయోమయంలో పడిపోయారు. పన్ను తగ్గిందని సంబరపడాలా? కొత్త విధానంతో మినహాయిపులు వర్తించవని బాధపడాలా? ఏది ఎంచుకోవాలో తెలియక తలలు పట్టేసుకుంటున్నారు. 

 తగ్గించిన పన్ను శ్లాబులు ఇవే :
* రూ.2.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల మధ్య ఆదాయం 5 శాతం పన్ను చెల్లించాలి.
* రూ. 5 లక్షల నుంచి రూ. 7.5 లక్షల మధ్య ఆదాయం 10 శాతం పన్ను (గతంలో 20%)
* రూ.7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఆదాయం 15 శాతం పన్ను (గతంలో 20%)
* రూ.10 లక్షల నుంచి రూ. 12.5 లక్షల మధ్య ఆదాయం 20 శాతం పన్ను (గతంలో 20%)
* రూ.12.5 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ఆదాయం 25 శాతం పన్ను (గతంలో 20%)
* రూ.15 లక్షల పైనా వార్షిక ఆదాయం ఉంటే 30 శాతం మేర పన్ను చెల్లించాలి.