బీటెక్ విద్యార్థులకు బంపర్ ఆఫర్…40వేల మంది ఫ్రెషర్స్ నియామకానికి TCS ఓకే

  • Published By: venkaiahnaidu ,Published On : July 13, 2020 / 07:37 PM IST
బీటెక్ విద్యార్థులకు బంపర్ ఆఫర్…40వేల మంది ఫ్రెషర్స్ నియామకానికి TCS ఓకే

ఓవైపు కరోనా సంక్షోభంతో కొత్త ఉద్యోగాల మాట అటుంచి ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటువంటి సంక్షోభ సమయంలో కూడా భారీగా కొత్త ఉద్యోగాలు ఇచ్చేందుకు దేశంలోని అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) సిద్ధమైంది.

ఈ సంవత్సరం కూడా క్యాంపస్ రిక్రూట్ మెంట్ ద్వారా 40,000 మంది ఫ్రెషర్స్ ను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని టిసిఎస్ నిర్ణయించింది. ఇంజనీర్లతో పాటు, సంస్థ టాప్ టెన్ బిజినెస్ స్కూల్స్ నుంచి గ్రాడ్యుయేట్లను కూడా తీసుకోనుంది. గత సంవత్సరం కూడా భారత్ లో టిసిఎస్ 40 వేల మందిని క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించుకున్న విషయం తెలిసిందే.

కరోనా కారణంగా జూన్ త్రైమాసికంలో టిసిఎస్ ఆదాయం బాగా పడిపోయింది. అయినప్పటికీ, ఈసారి(2020) కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా 40 వేల మందిని నియమించాలని కంపెనీ నిర్ణయించింది. టీసీఎస్ ఈవీపీ& గ్లోబల్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌ మిలింద్‌ లక్కడ్‌ మాట్లాడుతూ…భారతదేశంలో మేము 40 వేల నియామకాలు చేస్తాము. ఈ సంఖ్య 45 వేలు కూడా కావచ్చు. ఇది వ్యూహాత్మక ఎత్తుగడ అవుతుంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో వ్యాపారం తిరిగి ట్రాక్‌లోకి వస్తుందని కంపెనీ ఆశిస్తోంది అని అయన తెలిపారు.

అలాగే, ఈ ఏడాది యుఎస్‌లో క్యాంపస్ రిక్రూట్ మెంట్ ద్వారా సుమారు 2000 మంది నియమించాలని కంపెనీ యోచిస్తోంది. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు. H-1B మరియు L-1 వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే దీని లక్ష్యంగా ఉంది. ఎందుకంటే ఆ వీసాలను ఇప్పుడు అమెరికా రద్దు చేసింది.

2014 నుండి 20,000 మందికి పైగా అమెరికన్లను నియమించుకున్నట్లు లక్కడ్‌ గుర్తు చేశారు. హెచ్ -1 బి, ఎల్ -1 వర్క్ వీసాలను నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని, అన్యాయమని లక్కడ్ పేర్కొన్నారు. ఇది స్వల్పకాలిక ప్రభావాన్ని చూపుతుందని ఆయన అన్నారు. ఇది ఉద్యోగులలో అనిశ్చితి మరియు ఆగ్రహాన్ని కలిగించిందని ఆయన అన్నారు.