సెకండరీ స్కూళ్లో 12మంది టీచర్లకు కరోనా.. ఒక టీచర్ మృతి

సెకండరీ స్కూళ్లో 12మంది టీచర్లకు కరోనా.. ఒక టీచర్ మృతి

Teacher dies of Covid in Punjab : పంజాబ్‌లో కరోనాతో టీచర్ మృతిచెందారు. లుథియానాలోని జాగ్రాన్ లో ఘాలిబ్ కాలన్ గ్రామంలోని సీనియర్ సెకండరీ స్కూల్ టీచర్ తేజేందర్ కౌర్ (40) కరోనాబారినపడి మరణించారు. దయానంద్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పటిల్ (DMCH)లో చికిత్స పొందుతూ మరణించినట్టు స్కూల్ ప్రిన్సిపల్ సోహన్ సింగ్ వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం కరోనా తీవ్ర లక్షణాలతో DMCH ఆస్పత్రిలో చేరారు.

ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్టు తెలిపారు. ఇప్పటివరకూ తమ స్కూళ్లో మొత్తం 12 మంది టీచర్లు, ముగ్గురు విద్యార్థులు కరోనాబారినపడ్డారని ప్రిన్సిపల్ చెప్పారు. స్కూళ్లో 39 మంది టీచర్లలో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. మిగిలిన టీచర్లకు కూడా కరోనా టెస్టులు చేయిస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి 4 వరకు స్కూల్ మూసివేసినట్టు ప్రిన్సిపల్ పేర్కొన్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన టీచర్లు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అన్నారు. విద్యార్థుల నుంచి కూడా కరోనా శాంపిల్స్ తీసుకుంటున్నారని అదనపు డిప్యూటీ కమిషనర్ నీరు కత్యాల్ తెలిపారు. పంజాబ్ లో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కూల్ తరగతులు ప్రారంభమయ్యాయి.

జనవరి 27 నుంచి 3వ తరగతి నుంచి 4వ తరగతులు కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే ఫిబ్రవరి 1 నుంచి ఒకటి, రెండు తరగతులు ప్రారంభించేలా షెడ్యూల్ చేశారు. స్కూళ్లో కరోనా కేసులు పెరగడంతో మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది.