Dondasagu : దొండసాగులో మెళుకువలు…యాజమాన్యపద్దతులు

దొండ కాండాలను భూమిలో నాటినప్పుడు కొన్నిసార్లు దాని వేరుప్రాంతం మొత్తం కుళ్ళిపోతూ ఉంటుంది. అలాగే కుళ్ళిన ప్రాంతం మొత్తం పొలుసులుగా మారిపోతుంది. దీనికి కారణం వేరుకుళ్ల తెగులు.

Dondasagu : దొండసాగులో మెళుకువలు…యాజమాన్యపద్దతులు

Coccinia (2)

Dondasagu : కూరగాయల పంటల్లో దొండ ఒకటి. దొండలో విటమిన్‌ బి1, విటమిన్‌-బి పుష్కలంగా ఉంటాయి. అలాగే పోషకాలైన ఐరన్‌, కాలియంతో పాటు పీచు పదార్దాలు లభిస్తాయి. అందుకే ఎంతో మంది దొండను ఇష్ట ఇష్టపడతారు. రైతులకు కూడా ఈ పంట లాభదాయకంగా ఉంటుంది. సరైన సస్యరక్షణ చర్యలు చేపడుతూ దొండసాగు చేపడితే మంచి లాభాలు సాధించవచ్చు.

దొండను సాగు చేసే రైతులు దాని కాండం ముక్కలను తమపొలంలో ఒక్కసారి నాటుకుని దానికి పందిరి వేయాలి. ఇలా సాగు చేయడం వలన మూడు ఏండ్లవరకు పంట దిగుబడిని అధికంగా పొందవచ్చు. అయితే ఒక ఎకరం పొలంలో శాశ్వత పందిరి నిర్మాణానికి అటు ఇటుగా రూ.2,50,000 వరకు ఖర్చు అవుతుంది. దొండ సాగులో అధిక దిగుబడులు సాధించుటకు మంచి పంట యాజమాన్య పద్ధతులు అవలింబించాలి. దొండకు సారవంతమైన నేల తో పాటు , నీటి సౌలభ్యం కూడా చాలా అవసరం.

తేమతో కూడిన పొడి వాతావరణం సాగుకు అనుకూలంగా ఉంటుంది. దొండ సాగు చేసే ప్రాంతంలో 25-30 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ల మధ్య ఉష్ణోగ్రత ఉంటే దొండ పెరుగుదల బాగుంటుంది. అలాగే పూత, పిందె బాగా వస్తుంది. దొండసాగుకు నీటిని నిలుపుకునే బంకమట్టి నేలలైతే ఎంతో అనుకూలంగా ఉంటాయి. అదే కాకుండా మరుగు నీరు పోయే సౌకర్యం ఉన్నజండ్రు నేలల్లో కూడా దొండసాగును చేయొచ్చు. నేల ఉదజని సూచిక 6-7 మధ్య ఉంటే దొండసాగు బాగా ఉంటుంది.

దొండ సాగు చేయాలనుకునే వాళ్లు అప్పుడు ఇప్పుడు అని ఏమీ లేకుండా ఏడాది పొడవునా నాటుకోవచ్చు. కావలసిందల్లా నీటి కొరత లేకుందా ఉండటం. నీటి కొరత లేదని అనుకుంటే సంవత్సరం పొడవునా అన్ని రుతువుల్లో దీన్ని సాగు చేయవచ్చు. మే, జూన్‌, జూలై, ఫిబ్రవరిలో నెలల్లో నాటుకుంటే అధిక దిగుబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

దొండ సాగును కాండం ముక్కల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. మన చూపుడు వేలు మందంతో ఉండి, 20 సెం.మీ. పొడవు ఉండేలా కాండాన్ని ముక్కలుగా చేయాలి. దీనికి నాలుగు కణుపులు ఉండేలా చూసుకోవాలి. ఒక ఎకరం పొలానికిఅటు ఇటుగా 2,000 కాండం ముక్కలు అవసరమౌతాయి. అయితే ఇలా కట్‌ చేసి పెట్టుకున్న కాండం ముక్కలను ఒక లీటరు నీటికి 3 గ్రా. కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ ద్రావణంలో కలిపి తయారు చేసుకున్న మిశ్రమంలో ముంచి తీయాలి. మనం దొండసాగుకు ఎంచుకున్న పొలంలో వరుసల మధ్య 2 మీ., మొక్కల మధ్య 1 మీ. దూరం ఉండేలా నాట్లను పెట్టుకోవాల్సి ఉంటుంది.

కాండం ముక్కలను నాటడానికి ఒక అడుగు గుంతను ముందుగా తయారు చేసుకోవాలి. అందులో నీరు నిలవకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ గుంతలో మట్టి, కంపోస్టు కొద్దిగా ఇసుక కలిపిన మిశ్రమాన్ని దొండ కాండం ముక్కలను నాటడానికి ముందే నింపేయాల్సి ఉంటుంది. ఆ గుంతల్లో 100 గ్రా. ఎరువును 7:10:5 ఎన్‌.పి.కె. నిష్పత్తిలో వేసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండ పేడ, వేవ గింజల నూనెను కూడా ఉపయోగించుకోవచ్చు. కాండం ముక్కలను నాటిని 45 నుండి 60 రోజులకు పూతకు వస్తుంది. 85 నుండి 100 రోజలకు దొండ కోత ప్రారంభమౌతుంది. ఎకరానికి 60 టన్నుల వరకు దిగుబడి వస్తోంది.

చీడపీడలు…తెగుళ్ళు…

దొండను తెగుళ్ళు, పురుగులు ఆశిస్తుంటాయి. వాటికి సరైన సమయంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకోకపోతే పంటకు నష్టం వాటిల్లుతుంది. దీనివల్ల దిగుబడి తగ్గిపోతుంది. దొండను ఆశించే పురుగుల్లో…

పండు ఈగ సమస్య...దొండసాగులో పంట పూత దశకు రాగానే తల్లి ఈగలు పువ్వులపై గుడ్లను పెడుతుంటాయి. ఆ తర్వాత పూత, పిందెలలోకి చేరుతాయి. దాంతో కాయలను తిని పంటకు ఎంతో నష్టాన్ని కలుగజేస్తాయి. దీని నివారణకు పూత, పిందె దశలలో కొన్ని చర్యలు తీసుకోవాలి. అందులో ముందుగా మలాథియాన్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు దొండ తీగలపై పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 100 మి.లీ. మలాథియాన్‌ కు 100 గ్రా. చక్కెర లేదా బెల్లం పాకం లీటరు నీటిలో కలిపి ఉంటుచోవాలి. దాన్ని మట్టి పాత్రల్లో పోసి పొలంలో అక్కడక్కడ పెట్టాల్సి ఉంటుంది. దీంతో పంటను ఆశించే పురుగులను చంపేయొచ్చు.

గాల్ఫై సమస్య… ఇది దొండపంట తొలి దశలో ఉన్నప్పుడే ఆశిస్తుంది. దీని నివారణ కోసం 5 శాతం వేప కషాయాన్ని తయారు చేసుకుని పంట తొలి దశలో ఉన్నప్పుడే పిచికారీ చేయాలి. దీని వలన ఈ పరుగు విచక్షణ శక్తిని కోల్పోతుంది. దాంతో పంటను ఆశించదు. గాల్భై ఆశించిన తీగలను గుర్తిస్తే వెంటనే వాటిని కత్తిరించాలి. ఆ తర్వాత ఎసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి, లేదా క్లోరోపైరిఫాస్‌ 2 మి.లీ. లీటరు నీటికి లేదా డైమిధోయేట్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలుపుని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దాన్ని పంటపై పిచికారీ చేసుకోవాలి. దాంతో ఆ పురుగులు మళ్లీ ఆశించవు. దీంతో గల్పై పురుగుల నివారణ సాధ్యం అవుతుంది.

దొండను ఆశించే తెగుళ్ళు…

వేరుకుళ్ళ తెగులు ; దొండ కాండాలను భూమిలో నాటినప్పుడు కొన్నిసార్లు దాని వేరుప్రాంతం మొత్తం కుళ్ళిపోతూ ఉంటుంది. అలాగే కుళ్ళిన ప్రాంతం మొత్తం పొలుసులుగా మారిపోతుంది. దీనికి కారణం వేరుకుళ్ల తెగులు. దీని నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ ద్రావణంతో శుద్ధి చేసిన కాండం ముక్కలను వాడితే ఈ తెగులు రాదు. అలాగే మొక్కల చుట్టూ లీటరు నీటికి 2 గ్రా. మెటలాక్సిల్‌ కలిపిన ద్రావణాన్ని నేలంతా తడిసేలా పోయాల్సి ఉంటుంది. ఇక తెగులు ఆశించిన మొక్క చుటూ దాదాపు ఒక మీటరు దూరంలో ఈ ద్రావణాన్ని పోయాలి.

వెర్రి తెగులు ; దొండసాగుకు వెర్రి తెగులు సోకినట్లయితే ఆకు, ఈనెల మధ్య మందంగా చారలు కనిపిస్తాయి. ఇక ఆకులైతే పెళుసుగా గీడసబారిపోతాయి. ఇలా కావడం వలన పూత, పిందెలు కాయడం ఆగిపోతుంది. దీని నివారణ చేయాలంటే తెగులు సోకిన మొక్కలను ముందుగా పీకి నాశనం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ తెగులును వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు 2 మి.లీ. డైమిధోయేట్‌ ను లీటరు నీటికి కలిపి తయారు చేసుకున్న మిశ్రమాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది.