రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఉగ్రవాదం

  • Published By: venkaiahnaidu ,Published On : April 18, 2019 / 09:30 AM IST
రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఉగ్రవాదం

ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చాలా కృషి చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఇంకా ఉగ్రవాదం ఉందని, ఈ జిల్లాల్లో తప్ప మరే ప్రాంతంలోనూ ఈ ఐదేళ్లలో బాంబు పేల్లుళ్లు జరుగలేదని ఆయన తెలిపారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(ఏప్రిల్-18,2019)గుజరాత్ లో ని అమ్రేలిలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటూ భారత్‌ ను పాకిస్థాన్‌ బహిరంగంగా వేడుకోవాల్సి వచ్చిందని మోడీ అన్నారు.

గుజరాత్‌ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్‌ విగ్రహం మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని అగౌరవపర్చడానికి నిర్మించిన విగ్రహం కాదన్నారు. పటేల్‌ దేశానికి మొదటి ప్రధానమంత్రి అయి ఉంటే ఇప్పటి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండేవన్నారు. గత ప్రభుత్వాలు గుజరాత్‌ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని మోడీ విమర్శించారు. సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టును 40 ఏళ్ల క్రితమే పూర్తి చేసి ఉంటే గుజరాత్‌ పరిస్థితులు చాలా మెరుగ్గా ఉండేవన్నారు.2017లో డోక్లాంలో భారత్‌, చైనా మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సమయంలో అవి బాగా ఉపయోగపడ్డాయని మోడీ అన్నారు.ఆ సమయంలో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టంకట్టారని అన్నారు. మూడోదశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా గుజరాత్‌ లోని 26 స్థానాలకు ఏప్రిల్‌- 23,2019న పోలింగ్‌ జరగనుంది. మే-23,2019న ఫలితాలు వెలువడనున్నాయి.