ఇకపై ఆలా చేయండి : కరోనా టెస్టులపై రాష్ట్రాలకు కేంద్రం సూచన

  • Published By: venkaiahnaidu ,Published On : September 10, 2020 / 05:28 PM IST
ఇకపై ఆలా చేయండి : కరోనా టెస్టులపై రాష్ట్రాలకు కేంద్రం సూచన

కరోనా టెస్టులపై గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ,ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)
సంయుక్తంగా కొత్త మార్గదర్శకాలు జారీ చేశాయి. కరోనా లక్షణాలు(జ్వరం, దగ్గు, శ్వాస సమస్య) ఉన్న ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే.. RT-PCR విధానంలో మరోసారి తప్పనిసరిగా టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం,ICMR సూచించింది.



ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కరోనా లక్షణాలు ఉన్నవారికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారని, అయితే, అందులో నెగిటివ్ వస్తే RT-PCR టెస్టులు చేయడం లేదని కేంద్రం దృష్టికి వచ్చినట్టు తెలిపింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది కదా అని వదిలేస్తే కరోనా లక్షణాలు ఉన్నవారి ద్వారా మిగిలిన వారికి కూడా వ్యాపించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది.


కరోనా టెస్టుల్లో RT-PCR అనేది గోల్డ్ స్టాండర్డ్. దీన్ని గుర్తు పెట్టుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు చేసిన అసింప్టమాటిక్ (రోగ లక్షణాలు లేని) కేసుల్లో రెండు, మూడు రోజుల తర్వాత మళ్లీ కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి కూడా RT-PCR టెస్టులు చేయాలని సూచించింది. ఇలా చేయడం వల్ల కరోనా బాధితులను త్వరగా గుర్తించవచ్చని, మరికొందరికి వ్యాపించే ప్రమాదాన్ని తప్పించవచ్చని కేంద్రం అభిప్రాయపడింది.