మీ సహకారం మరువలేనిది…దేశ ప్రజలకు మోడీ థ్యాంక్స్

  • Published By: venkaiahnaidu ,Published On : March 22, 2020 / 01:13 PM IST
మీ సహకారం మరువలేనిది…దేశ ప్రజలకు మోడీ థ్యాంక్స్

కరోనా వైరస్ పై పోరాటంలో ముందు వరుసలో నిలబడి వైరస్ తో యుద్ధం చేస్తున్న హెల్త్ వర్కర్లకు సంఘీభావం తెలియజేస్తూ ఇవాళ(మార్చి-22,2020)సాయంత్రం 5గంటలకు ఇంటి గుమ్మం దగ్గరకు లేదా బాల్కనీలోకి లేదా టెర్రస్ పైకి వచ్చి చప్పట్లు కొట్టిన,గంటలు మోగించిన కోట్లమంది భారతీయులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ థ్యాంక్స్ చెప్పారు.

ఇది (చప్పట్లు మరియు శబ్దం) కృతజ్ఞతలు మరియు కరోనా వైరస్ కు వ్యతిరేకంగా సుదీర్ఘ యుద్ధంలో విజయం ప్రారంభమైంది. ఈ దృఢ నిశ్చయాన్ని మోస్తూ సుదీర్ఘ పోరాటం కోసం స్థిద్ధపడదాం అంటూ మోడీ ట్వీట్ ద్వారా తెలిపారు. కరోనా వైరస్ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ దేశం ధన్యవాదాలు చెబుతుందని మోడీ ట్వీట్ లో తెలిపారు.

కరోనా విషయమై గురువారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆదివారం(మార్చి-22,2020)ఉదయం 7గంటలనుంచి 9గంటలవరకు(మొత్తం 14గంటలు)జనతా కర్ఫ్యూ పాటిద్దాం అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునివ్వగా,ఆయన పిలుపుకు విశేషమైన స్పందన ఇవాళ లభించింది. ఇవాళ ఇండియా అంతా ఇంటికే పరిమితమైంది. ఎవ్వరూ ఇళ్లల్లోనుంచి బయటకు రాలేదు.

అయితే రాత్రీపగలు తేడా లేకుండా,తమ ప్రాణాలు కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యంగా హాస్పిటల్స్ లో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి సంఘీభావంగా సాయంత్రం 5గంటలకు ప్రతి ఒక్కరు తమ ఇళ్ల గుమ్మం దగ్గరకు లేదా బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టాలని మోడీ తెలిపిన మేరకు ఇవాళ 5గంటలు అవగానే,దేశవ్యాప్తంగా ప్రజలు ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టారు. చప్పట్లతో దేశం మార్మోగిపోయింది. కొన్ని చోట్లా చప్పట్లతో పటు బెల్స్ కూడా మోగించారు. డ్రమ్స్ కూడా మోగించారు.

రాష్ట్రాల ముఖ్యమంత్రులు,మంత్రులు,అధికారులు కూడా తమ కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ఆవరణలోకి వచ్చి చప్పట్లు కొట్టారు. భార‌త్‌ లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 341కి చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 7కి చేరుకున్న‌ది. ఇవాళ  ఒక్కొరోజే ముగ్గురు మ‌ర‌ణించారు.