భారత సైన్యానికి చలి నుంచి రక్షణ కల్పించేందుకు అమెరికా నుంచి దుస్తులు

  • Published By: bheemraj ,Published On : November 4, 2020 / 03:26 AM IST
భారత సైన్యానికి చలి నుంచి రక్షణ కల్పించేందుకు అమెరికా నుంచి దుస్తులు

Indian Army security : భారత్, చైనా సరిహద్దులో కొన్ని నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చలికాలం ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరుగనుండటంతో భారత సైన్యం భద్రతకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యం కోసం అతి శీతల వాతావరణంలో ధరించే దుస్తులను అమెరికా నుంచి తెప్పించినట్లు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.



‘మొదటగా కొద్ది మొత్తంలో అతి శీతల వాతావరణ పరిస్థితుల్లో వాడే దస్తులు అమెరికా భద్రతా దళాల నుంచి భారత్ కు చేరాయి. వాటిని మన సైన్యం ఇప్పటికే వినియోగిస్తోంది’ అని పేర్కొన్నాయి. సియాచిన్, తూర్పు లడ్డాక్ సెక్టార్ సహా లడ్డాక్ ప్రాంతమంతా మోహరించిన దళాల కోసం భారత్ సైన్యం 60,000 మందికి సరిపడా ఈ తరహా దుస్తులను ముందుగానే నిల్వ చేస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం మరో 30,000 మంది కోసం అదనపు అవసరం ఏర్పడిందన్నాయి.



సరిహద్దు ప్రాంతంలో చైనా ఆర్మీ దుందుడుకు చర్యలను దృష్టిలో ఉంచుకొని సుమారు 90,000 మంది సైనికులను మోహరించాల్సిన పరిస్థితి ఎదురైందని, దీంతో అత్యవసరంగా ఈ దుస్తులను తెప్పించడం వల్ల అత్యంత శీతల పరిస్థితుల్లో కూడా సైన్యం తట్టుకొని నిలబడి ఉండటానికి దోహదం చేస్తుందని పేర్కొన్నాయి. అంతేకాకుండా ప్రత్యేక దళాల కోసం అమెరికా నుంచి రైఫిళ్ల వంటి కొన్ని ఆయుధాలను కూడా భారత్ తెప్పిస్తోంది.