Heatwave Danger : ప్రపంచానికి సవాల్ విసురుతున్న హీట్ వేవ్స్..రాబోయే విధ్వంసాన్ని నియంత్రించగలమా? తీసుకోవాల్సిన చర్యలేంటీ..?

హీట్ వేవ్స్..ప్రపంచానికి సవాల్ విసురుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ నియంత్రించటానికి ప్రపంచదేశాలన్నీ వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేదంటే రాబోయే విధ్వంసానికి మనిషి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Heatwave Danger : ప్రపంచానికి సవాల్ విసురుతున్న హీట్ వేవ్స్..రాబోయే విధ్వంసాన్ని నియంత్రించగలమా? తీసుకోవాల్సిన చర్యలేంటీ..?

The danger of heat waves..

Heatwave Danger : ప్రకృతికి మనం ఏమిస్తామో అది మనకు తిరిగి అదే ఇస్తుంది. ఇది అర్థం చేసుకోలేని మనిషి ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నాడు. పర్యావరణాన్ని ఇష్టానుసారంగా నాశనం చేసేస్తున్నాడు. వాతావరణంలో ఇన్ని మార్పులు సంభవిస్తున్నా.. ఏమీ జరగనట్లుగా తన విధ్వంసం తాను చేసుకుపోతున్నాడు. కానీ ఇటువంటి అరాచకాలకు ప్రకృతి ఇచ్చే రిటన్ గిఫ్టు కూడా తీసుకోవాల్సిందే మనిషి. తప్పదు. అయినా ఏమీ తెలియనట్లుగా చాలా కూల్ గా తన పని తాను చేసుకుపోతున్నాడు. విధ్వంసాల బాటలో కొనసాగుతున్నాడు. వీటి ప్రభావమే హీట్ వేవ్స్. ఈ హీట్ వేవ్ మామూలుగా ఉండవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇప్పటికే హీట్ వేవ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. దీని వల్ల ఏం కోల్పోతున్నామో అర్థం చేసుకోలేకపోతున్నాం. మరి.. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా ప్రపంచ దేశాలు తక్షణం చేపట్టాల్సిన చర్యలేంటి?

హీట్ వేవ్స్‌ని ఎలా అరికట్టాలన్న దానికంటే ముందు.. వాటి ఇంపాక్ట్ ఇండియాపై ఎలా ఉండబోతుందన్న దానికి.. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. కోవిడ్‌కి ముందు ప్రపంచంలోని ఔషధాల ఉత్పత్తిలో.. మూడో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారత్.. దాదాపు 20 శాతం సున్నితమైన మెడికల్ ఉత్పత్తులను, 25 శాతం వ్యాక్సిన్లను.. దెబ్బతిన్న కోల్డ్ చైన్ల కారణంగా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో.. ఇప్పుడే వడగాలులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరికొన్నేళ్లలోనే పెరిగిపోయే ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. ఇప్పటికే.. వాతావరణ మార్పులతో సంభవిస్తున్న ప్రకృతి విపత్తులు, హీట్ వేవ్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణాలు పెరిగాయ్. వ్యవసాయం, టూరిజం, చేపల వేట, పారిశ్రామిక రంగంతో పాటు ఎన్నో రంగాలపై ఈ ప్రభావం పడింది. ఫలితం నష్టాలు చవిచూస్తున్నాయ్.

మండుతున్న ఎండలు, విపరీతంగా వీస్తున్న వడగాలులు, ఉక్కపోతను.. ప్రపంచ వ్యాప్తంగా దేశాలు తాళలేకపోతున్నాయ్. చల్లని వాతావరణం, మంచు కురిసే ప్రాంతాలున్న దేశాల్లోనూ.. గత సీజన్‌లో ఎండలు మండించేశాయి. వడదెబ్బతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో.. పాత టెంపరేచర్ల రికార్డులు బద్దలైపోయాయ్. అన్ని దేశాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఇక.. భారత్‌లో పెరిగిన హీట్ వేవ్స్ కారణంగా.. పంటల దిగుబడులు భారీగా తగ్గిపోయాయ్. పక్క దేశం పాకిస్తాన్‌లో కూడా ఇదే పరిస్థితి. హీట్ వేవ్స్ కారణంగా.. పాకిస్థాన్ లో పంటల దిగుబడి చాలా పడిపోయింది. గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాలు కొనసాగుతున్నంత వరకు.. ఇలాంటివి సాధారణమైపోతాయ్. భవిష్యత్తులో.. ఈ పరిస్థితులే విపత్తుగా మారి.. తినడానికి ఆహారం కూడా దొరకని స్థితికి చేరుస్తాయ్. నిజానికి.. భారత్‌లో అధిక ఉష్ణోగ్రతలు సర్వ సాధారణమే అయినా.. హీట్ వేవ్స్ కారణంగా టెంపరేచర్ మరింత పెరుగుతోంది. వాతావరణ మార్పులతో పంటల దిగుబడి తగ్గి.. కొన్నేళ్లకు డిమాండ్ పెరిగి.. సప్లై తగ్గిపోతుంది. అప్పుడు.. రేట్లు విపరీతంగా పెరిగిపోతాయ్. ఇంత జనాభాకు సరిపోయే పంట దిగుబడులు రాకపోతే.. పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.

Heat wave Danger On India : భారత్‌కు భీకరమైన హీట్ వేవ్స్ ముప్పు..మనుషుల జీవిత కాలంపై తీవ్ర ప్రభావం : వరల్డ్ బ్యాంక్ నివేదికలో హడలెత్తించే అంశాలు

శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు వాతావరణంలో మార్పులను గమనిస్తూనే ఉన్నారు. అవి.. మానవాళిపై చూపే ప్రభావాన్ని లెక్కిస్తూనే ఉన్నారు. గ్లోబల్ వార్మింగ్ ఈ శతాబ్దం చివరినాటికి పరిమితమయ్యే అవకాశం ఉన్నా.. తక్షణ నివారణ చర్యలు అవసరం. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు.. ఇప్పటికీ ప్రపంచ దేశాలకు అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు. భూ ఉష్ణోగ్రతల పెరుగుదలను ఒకటిన్నర డిగ్రీల సెంటీగ్రేడ్‌కే పరిమితం చేస్తే .. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ఫలితాలను తగ్గించే అవకాశముంది. ఇందుకోసం.. ఇంధన వ్యవస్థ, భూ వినియోగం, రవాణా రంగంలో వెంటనే చేపట్టాల్సిన మార్పులపై ఆలోచించాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.

గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతున్న ప్రపంచదేశాల్లో.. భారత్ పాత్ర చాలా తక్కువే అయినప్పటికీ.. దాని ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకునే పరిస్థితి లేదు. ఉష్ణోగ్రతలు పెరిగి అన్ని ప్రాంతాల్లోని.. మనుషులపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ దారుణమైన పరిస్థితులు రాకూడదంటే.. పర్యావరణానికి హాని కలిగించకుండా జీవించాలి. భూతాపం, గ్రీన్ హౌజ్ ఉద్గారాలను తగ్గించేందుకు అన్ని ప్రణాళికలను అమలు చేస్తే.. 2019లో ఉన్న దానికంటే 2050లో 68 శాతం తక్కువ ఉద్గారాలు ఉంటాయని ఐక్యరాజ్యసమితి రీసెర్చ్ రిపోర్టులు చెబుతున్నాయ్. ఇది జరగాలంటే.. అన్ని దేశాలు వారి ప్రణాళికలను రాబోయే ఎనిమిదేళ్లలోనే అమలు చేయాలి. కానీ.. ఇదేమంత ఈజీ కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

అయితే.. గ్లోబ్ మొత్తంలో విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలకు బాధ్యత వహించాల్సింది ధనిక దేశాలేనన్న అభిప్రాయాలున్నాయ్. ఆ సవాల్ స్వీకరించేందుకు కావాల్సిన అన్ని వనరులు అభివృద్ధి చెందిన దేశాల దగ్గరే ఉన్నాయ్. పేద దేశాలు, చిన్న దేశాలతో సంభవించే వాతావరణ మార్పులు చాలా తక్కువ. అయినప్పటికీ.. క్లైమేట్ ఛేంజ్ కారణంగా.. ఎక్కువ నష్టపోతున్నవి ఆ దేశాలే. 2030 నాటికి గనక కర్బన ఉద్గారాలను తగ్గించలేకపోతే.. పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయ్.