కోవిషీల్డ్‌, కొవాగ్జిన్‌పై నేడే తుది నిర్ణయం..కీలక ప్రకటన చేయనున్న డీసీజీఐ

కోవిషీల్డ్‌, కొవాగ్జిన్‌పై నేడే తుది నిర్ణయం..కీలక ప్రకటన చేయనున్న డీసీజీఐ

The DCGI will key statement on covishield and covaxin : భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. భారత ప్రభుత్వం టీకాను వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో అనుమతిస్తూ.. డీసీజీఐకి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల వినియోగం, అనుమతులపై డీసీజీఐ ఇవాళ కీలక ప్రకటన చేయనుంది. ఉదయం 11 గంటలకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ మీడియాతో మాట్లాడే అవకాశముంది. దీంతో డీసీజీఐ రెండు వ్యాక్సిన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొంది.

డీసీజీఐ నియమించిన సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ శుక్రవారం కొవిషీల్డ్‌, శనివారం కొవాగ్జిన్‌కు ఆమోద ముద్రవేయాలని సిఫారసు చేసింది. కొవిషీల్డ్‌ను ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేయగా.. పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తోంది. కొవాగ్జిన్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన టీకా. ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ, ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో అభివృద్ధి చేసింది. నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేసిన నేపథ్యం డీసీజీఐ నిర్ణయం ప్రకటిస్తే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు ఇప్పటికే వ్యాక్సిన్‌ పంపిణీకి అవసరమైన ఏర్పాట్లును ముమ్మరం చేసింది.

కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాల అత్యవసర వినియోగానికి ఆమోదించిన నిపుణుల బృందం … వీటిని భారత ఔషధ నియంత్రణ సంస్థకు పంపుతుంది. వీటికి డీసీజీఐ ఆమోదముద్ర వేసి అనుమతుల పత్రాన్ని జారీచేస్తుంది. అనంతరం అనుమతి పొందిన సంస్థ.. మార్కెట్‌ ఆథరైజేషన్‌, ఉత్పత్తికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యాకే మార్కెట్‌లోకి టీకాను తీసుకురావడానికి వీలవుతుంది.

రోగికి ప్రత్యామ్నాయ చికిత్సలేవీ అందుబాటులో లేవన్నప్పుడు మాత్రమే కొన్ని టీకాలను అత్యవసర వినియోగం కోసం అనుమతి ఇస్తారు. ఆ వ్యాక్సిన్‌ ఇచ్చే ముందు ప్రతి రోగి నుంచి ముందస్తు అనుమతి పత్రం తీసుకోవాలి. ఆ టీకా వల్ల తలెత్తే అవకాశమున్న దుష్ప్రభావాల గురించి రోగికి, వారి కుటుంబ సభ్యులకు ముందే చెప్పాలి. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తికాక ముందే మధ్యంతర ఫలితాల ఆధారంగా అనుమతులు ఇస్తున్నందున ఈ షరతులు విధిస్తారు.

ప్రభుత్వం నిర్ణయించిన ప్రాధాన్య క్రమంలో కోటి మంది వైద్య సిబ్బంది, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, 50 ఏళ్ల పైబడిన 27 కోట్ల మందికి తొలిదశలో టీకా అందిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టీకాలను నేరుగా మార్కెట్‌లోకి తెస్తే బ్లాక్‌ మార్కెట్‌కు తెర లేచే అవకాశం ఉన్నందున ప్రభుత్వ సంస్థల ద్వారానే వీటిని అందించాలన్న షరతు విధించే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం…. ఈనెల 6 నుంచే మనదేశంలో వ్యాక్సినేషన్‌ ప్రారంభించే అవకాశముంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది.

ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాధాన్యతా లిస్టులో లేకపోయినా వ్యాక్సిన్లు వేయించుకోవాలనుకునే వారు పేర్లు నమోదు చేసుకునేందుకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంటిలిజెన్స్‌ నెట్‌వర్క్‌ – Co-WIN పేరుతో మొబైల్‌ యాప్‌ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఓటర్‌ఐడీ, అధార్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పెన్షన్‌ పత్రాల్లో ఉండే సమాచారం అందివ్వడం ద్వారా Co-WIN యాప్‌లో వ్యాక్సిన్‌ కోసం నమోదు చేసుకోవచ్చు.