Karnataka Congress : డీకే శివకుమార్ లంచాలు తీసుకుంటారు..సొంతపార్టీ నేతల సంభాషణ వీడియో వైరల్

కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌పై సొంత పార్టీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. డీకే శివకుమార్ లంచాలు తీసుకుంటారని, మద్యం సేవిస్తారంటూ చేసిన వ్యాఖ్యల వీడియో లీక్‌ అయ్యింది. ఈ వీడియో

Karnataka Congress : డీకే శివకుమార్ లంచాలు తీసుకుంటారు..సొంతపార్టీ నేతల సంభాషణ వీడియో వైరల్

Karnataka (4)

Karnataka Congress   కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌పై సొంత పార్టీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. డీకే శివకుమార్ లంచాలు తీసుకుంటారని, మద్యం సేవిస్తారంటూ చేసిన వ్యాఖ్యల వీడియో లీక్‌ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో కలకం రేపుతోంది. పలువురు బీజేపీ నేతలు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అసలేం జరిగింది
కాంగ్రెస్ మాజీ ఎంపీ వీఎస్‌ ఉగ్రప్ప, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కోఆర్డినేటర్ ఎంకే సలీం మంగళవారం ఓ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అయితే మీడియా సమావేశం ప్రారంభమవడానికి ముందు ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతలు.. డీకే శివకుమార్‌కు సంబంధం ఉన్న ఒక కుంభకోణం గురించి మాట్లాడుకున్నారు. అయితే తాము మాట్లాడుతుకుంటున్నది రికార్డ్ అవుతుందన్నది గుర్తెరగని ఈ ఇద్దరు నేతలు.. డీకే శివకుమార్‌తోపాటు ఆయన అనుచరుడు కోట్లలో లంచాలు తీసుకున్నట్లు ఆరోపించారు. ముందుగా ఆరు నుండి ఎనిమిది శాతం ఉండగా..డీకే శివకుమార్ వచ్చాక 10 నుంచి 12 శాతంగా మారింది. ఇదంతా డీకే సర్దుబాటు చేశారు. ముల్గుండ్ (డీకే అనుచరుడు) రూ.50-100 కోట్లు సంపాదించాడు. ముల్గుండ్ వద్ద ఇంత ఉంటే, డీకే వద్ద ఇంక ఎంత ఉంటుంది అని ఎంకే సలీమ్ అన్నారు.

మాట్లాడుతున్నప్పుడు డీకే తడబడతాడు.. తక్కువ బీపీ వల్లనా లేక మద్యం సేవించి ఉండటంతోనా అన్నది నాకు తెలియదు.. సిద్ధరామయ్య బాడీ లాంగ్వేజ్ కడక్ (చాలా స్మార్ట్‌) అని సలీమ్ అన్నారు. డీకే శివకుమార్‌ వల్ల పార్టీ ఎలాంటి ఉపయోగం లేదని వీఎస్‌ ఉగ్రప్ప, సలీం చర్చించుకున్నారు. డీకేను పార్టీ అధ్యక్షుడ్ని చేయడానికి మనమంతా తీవ్రంగా పోరాడాం. కానీ ఆయన మనల్ని, పార్టీని బాధపెట్టాడు అని ఉగ్రప్ప 2 నిమిషాల నిడివి గల వీడియో క్లిప్‌లో అన్నారు.

ఉగ్రప్ప వివరణ-సలీం బహిష్కరణ

ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారిన నేపథ్యంలో బుధవారం మాజీ ఎంపీ వీఎస్‌ ఉగ్రప్ప మీడియాతో మాట్లాడుతూ…నిన్న విలేకరుల సమావేశంలో ప్రసంగించడానికి వచ్చాను. మా మీడియా సమన్వయకర్త సలీం..కొంతమంది వ్యక్తులు డికె శివకుమార్ డబ్బులు తీసుకుంటున్నారని నా చెవిలో చిన్నగా చెప్పారు. వాస్తవానికి ఇది బీజేపీ చేస్తున్న ఆరోపణ,సలీమ్ కేవలం నాకు ఈ విషయాన్ని చెబుతున్నాడు అంతే. బీజేపీ పార్టీ డీకే శివకుమార్‌పై చేస్తున్న ఆరోపణలపై సలీమ్ నాకు అవగాహన కల్పించాడు. విలేఖరుల సమావేశం తర్వాత నేను సలీమ్‌తో మాట్లాడాను ..శివకుమార్ పై చేసిన వ్యాఖ్యలు తన ఆరోపణ కాదని … అది బీజేపీ మరియు ఇతరులు చేసిన ఆరోపణ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మీడియా ఈ విషయమై మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే మీకు సమాచారం ఉండాలి … అందుకే నేను మీకు చెప్పాను అని సలీమ్ తనతో అన్నాడని ఉగ్రప్ప చెప్పారు. డీకే శివకుమార్‌పై బీజేపీ చేసిన వ్యాఖ్యలపైనే తాము చర్చించుకున్నామని, ఆయనపై తాము వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.

ఇక,వీడియో క్లిప్ నేపథ్యంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కోఆర్డినేటర్ ఎంకే సలీంను ఆరేండ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. ఇక, ఈ వీడియో క్లిప్ విషయంపై తాను కామెంట్ చేయనని..పార్టీ క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలు తీసుకుంటుందని డీకే శివకుమార్ చెప్పారు.